మనీతో పాటు మనసులూ గెలుచువచ్చు.. ఎన్టీఆర్ షో ఎమోషనల్ ప్రోమో..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గేమ్ షో ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్న సంగతి తెలిసిందే. ‘రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ వదిలిన తొలి ప్రోమో ఈ షో పై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో జెమినీ టీవీలో ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించి తాజా అప్డేట్ ఇచ్చారు నిర్వాహకులు. తారక్ హోస్ట్ చేస్తున్న ఈ షో ఆగస్టు నెలలోనే గర్జిస్తుందని వెల్లడించారు. ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు’ అంటూ సరికొత్త ప్రోమోను విడుదల చేశారు.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమోలో ఓ స్కూల్ టీచర్ పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని విద్యార్థులను అడుతుంది. దీనికి ‘కలెక్టర్’ అని ఒకరు.. ‘పైలెట్’ మరొకరు.. ‘చీఫ్ మినిస్టర్’ అని ఇంకొకరు సమాధానం చెబుతారు. అయితే ఓ అమ్మాయి మాత్రం ‘అమ్మ అవుదాం అనుకుంటున్నా’ అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అదే అమ్మాయి పెద్దయ్యాక ఎన్టీఆర్ ముందు హాట్ సీట్ లో కూర్చుని గేమ్ షో ఆడే అవకాశం అందుకుంది. ఈ సందర్భంగా ‘జీవితంలో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు?’ అని ఎన్టీఆర్ ప్రశ్నించగా.. ‘అమ్మను అవుదాం అనుకుంటున్నాను’ అని బదులిస్తుంది.

నాన్న చనిపోతే తన తల్లి మున్సిపల్ వర్కర్ గా రోడ్లు ఊడ్చి ఎన్నో కష్టాలు పడి ముగ్గురు ఆడబిడ్డలను పెంచి పోషించిందనే విషయాలను ఆ అమ్మాయి వివరించింది. కలెక్టర్ అయితే జిల్లాను సీఎం అయితే రాష్ట్రాన్ని పైలట్ అయితే విమానాన్ని నడపవచ్చని.. కానీ రేపటి తరాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది అమ్మ వల్లే అవుతుందని చెప్పుకొచ్చింది. ఆమె సమాధానం ఎన్టీఆర్ మనసుని గెలుచుకున్నట్లు చూపించిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇక్కడ మనీతో పాటు మనసులూ గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది కల మీది ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ మీసం మెలేస్తూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెలలోనే షో ప్రసారం అవుతుందని నిర్వాహకులు ప్రకటించడంతో తారక్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

కాగా ఎన్టీఆర్ గతంలో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-1 కు హోస్ట్ గా చేసి ఆడియన్స్ ని అలరించారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ తో స్మాల్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఇది బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ గేమ్ షో తరహాలో ఉండబోతోంది. గతంలో కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మూడు సీజన్స్ నిర్వహించారు. నాలుగో సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ షో ను ‘స్టార్ మా’ వారు నిర్వహించగా.. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న షో మాత్రం జెమిని టీవీలో టెలికాస్ట్ కానుంది. ఈ క్విజ్ షో లో అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి రూ. కోటి ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గేమ్ షో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఫస్ట్ ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ – చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యే అవకాశం ఉంది.

https://www.youtube.com/watch?v=RGMDSXnLIK8