ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బండ్ల.. నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు తీసే స్థాయికి ఎదిగారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లి.. సెన్సేషనల్ కామెంట్స్ తో బ్లేడ్ గణేష్ అనిపించుకున్నారు.
చివరకు పాలిటిక్స్ తన వల్ల కాదని చెప్పిన బండ్ల.. మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చేసారు. తన వ్యవహార శైలితోనే కాకుండా.. మనసుకు ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి తాను సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు.
ట్విట్టర్ లో ఖాతా కలిగివున్న బండ్ల గణేష్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తుంటారు. ముఖ్యంగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేయడంలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ట్వీట్స్ చేయడంలో అప్పుడప్పుడు తప్పులో కాలేస్తూ నెటిజన్లకు బలి అవుతుంటాడు. అయితే ఈరోజు ట్వీట్ చేస్తూ ”త్వరలో ట్విట్టర్ కి గుడ్ బై చెప్పేస్తా.. వివాదాలు వద్దు. నా జీవితంలో ఎలాంటి వివాదాలకు చోటు ఉండకూడదని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు బండ్ల. సడన్ గా కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏంటని అభిమానులు కామెంట్స్ రూపంలో ప్రశ్నిస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే.. ఎన్నో సినిమాల్లో హాస్యనటుడిగా మెప్పించిన బండ్ల గణేష్.. ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్ స్థాపించి సినిమా నిర్మాణంలోకి దిగాడు. ‘ఆంజనేయులు’ ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ ‘ఇద్దరమ్మాయిలతో’ ‘గోవిందుడు అందరివాడేలే’ ‘బాద్ షా’ ‘టెంపర్’ వంటి సినిమాలను నిర్మించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.