మొత్తం వెయ్యి మంది లోపే. ‘మా’ ఎన్నికలకు సంబంధించి పలువురి నోట నుంచి వస్తున్న మాట ఇది. నిజమే.. కేవలం వెయ్యి కంటే తక్కువమంది ఉన్న ఒక అసోసియేషన్ అంతర్గత ఎన్నికలు ఇప్పుడు ఎందుకంత హాట్ టాపిక్ గా మారాయి? అంటే.. దానికి కారణం ఆ వెయ్యి మంది సినిమా రంగానికి చెందిన వారుకావటం.. గ్లామర్ ప్రపంచంలో తళుకులీనే స్టార్లు కావటం. అలాంటి వారి మధ్య జరిగే ఎన్నికల పోరు హుందాగా సాగేందుకు బదులుగా.. రచ్చ రచ్చగా మారటం.. గెలుపు మాత్రమే తమ అంతిమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు అందరి చూపు పడేలా చేస్తోంది.
మన వీధిలో ఏదైనా కుటుంబం అదే పనిగా కొట్టుకుంటున్నా.. రోజూ అలవాటైనదే అయినప్పటికీ.. ఆ రోజుకు ఏం జరుగుతుందన్న ఆసక్తి ఉంటుంది. అదే.. మన వీధిలో సంపన్నులుగా చెలామణీ అయ్యే వారింట్లో రచ్చ జరుగుతుంటే.. మన పనులన్ని ఆపేసి మరీ దాని గురించే మాట్లాడుకుంటాం కదా? మొదటి ఫ్యామిలీ లొల్లి కంటే కూడా రెండో ఫ్యామిలీ లొల్లే ఆసక్తికరంగా ఉంటుంది కదా? సరిగ్గా అలాంటి సైకాలజీనే ‘మా’ ఎన్నికల్లోనూ నెలకొందని చెప్పాలి. అందుకే.. ఎంత రచ్చ అవుతున్నా.. ఊహకు అందని రీతిలోతిట్టుకుంటున్నా.. ఆసక్తిగాచూస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.
ఇదిలా ఉంటే.. మరోవైపు ఇప్పటివరకు ‘మా’ ఎన్నికల్లో భాగస్వామ్యం కాకుండా.. ఉన్న రెండు గ్రూపుల్లో ఏదో ఒక దాని వెంట నడవని వారిని.. తమలోకి లాక్కునేందుకు పడుతున్న ఆరాటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇప్పుడు ఆ వంతు ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆర్కే రోజాకు ఎదురైంది. ఇప్పటికే తాను రాష్ట్ర నేతగా పేరున్న వేళ.. ‘మా’ ఎన్నికల్లో వేలు పెట్టుకొని తన స్థాయిని తగ్గించుకోవాలన్న ఆలోచనలో లేనట్లు ఆమె మాటలు ఉన్నాయి.
విషయం ఏదైనా సరే.. కొట్టినట్లుగా మాట్లాడే ఆర్కే రోజా.. అందుకు భిన్నంగా ఆచితూచి అన్నట్లు మాట్లాడటం విశేషం. ‘మా’ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయని.. తాను ఎవరికి ఓటు వేయాలనుకున్న విషయాన్ని బయటకు చెప్పేందుకు ఆమె ఇష్టపడటం లేదు. సాధారణ ఎన్నికల మాదిరే మా ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్నాయని.. అందులో వేలు పెట్టాలని తానుఅనుకోవటం లేదన్నారు. ‘మా’లో సభ్యురాలిగా తన ఓటుహక్కును మాత్రం వినియోగించుకుంటానని చెప్పటం ద్వారా.. ఓటు వేస్తానన్న స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చినట్లైంది. మరి.. ఎవరికిఓటు వేస్తారన్న దానికి మాత్రం.. రెండు ప్యానళ్ల మేనిఫేస్టోల్ని పరిశీలించి ఎవరిది ఉపయోగంగా ఉంటుందో వారికే తన ఓటు అంటూ తెలివిగా తప్పించుకుంటోంది. లోకల్.. నాన్ లోకల్ లాంటి వివాదాస్పద అంశాల మీద తాను రియాక్టు కానని స్పష్టం చేయటం గమనార్హం.