ముఖ్యమంత్రిగారూ.. ఈ ముక్కల గోలేంటి.?

ఫామ్ హౌస్‌లో అడుగు పెడితే ఆరు ముక్కలవుతవ్.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బీజేపీ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద గరం గరం అయిపోయారు. మరీ ఇంత దారుణమా.? అంటూ, ముఖ్యమంత్రి వాడుతున్న పదజాలంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.

కేసీయార్ అంటేనే అంత. ఆయన ఏమైనా మాట్లాడతారు. ఏమన్నా అంటే, ‘మా తెలంగాణలో గిట్లనే మాట్లడతం రా బై..’ అనడం కేసీయార్‌కి వెన్నతో పెట్టిన విద్య. సరే, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమీ చెయ్యడంలేదా.? అంటే, అది వేరే చర్చ.

నరేంద్ర మోడీ పాలన బావుందని గతంలో ఇదే కేసీయార్ సెలవిచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతంగా పనిచేశారనీ కొనియాడారు. ఇప్పుడదే కేసీయార్, ప్రధాని మీద విరుచుకుపడుతున్నారు. దేశంలో ఈ దరిద్రానికి కారణం మీ పాలన కాదా.? అంటూ మండిపడుతున్నారిప్పుడు కేసీయార్.

నరేంద్ర మోడీ మీద విమర్శలు ఓ లెక్క.. బండి సంజయ్ మీద మాటల దాడి ఇంకోపక్క. సంజయ్ వర్సెస్ కేసీయార్.. పెద్ద రచ్చే జరుగుతోంది. ఇంతకు ముందు ఏ నాయకుడ్నీ వ్యక్తిగతంగా కేసీయార్ ఈ స్థాయిలో తిట్టలేదు.. ఒక్క చంద్రబాబు తప్ప.

అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు బండి సంజయ్.. అనుకోవాలేమో. అంటే, బండి సంజయ్ బలమైన నాయకుడని కేసీయార్ కితాబులిస్తున్నట్లే పరోక్షంగా. బండి సంజయ్ కోరుకునేది ఇంతకన్నా ఇంకేముంటుంది.?

ఒక్కటి మాత్రం నిజం.. కేసీయార్, కేంద్రం మీద విరుచుకుపడుతున్న మాటల్లో వాస్తవం వున్నట్టే.. కేసీయార్ భయపడుతున్నారన్నదాంట్లోనూ వాస్తవం వుంది. లేకపోతే, కేసీయార్.. డెయిలీ సీరియల్ తరహాలో ఈ ప్రెస్ మీట్లు ఎందుకు పెడతారు చెప్మా.?