జనసేన పార్టీ నుంచి అధికార పార్టీ మీద సెటైర్ల వర్షం కురుస్తూనే వుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి..’ అంటూ సెటైరేసింది జనసేన పార్టీ. దీన్ని కొందరు వైసీపీ మద్దతుదారులు పాజిటివ్ యాంగిల్‌లో చూస్తోంటే, ఇంకొందరు వైసీపీ మద్దతుదారులేమో.. ‘మా ముఖ్యమంత్రిని పట్టుకుని అంత మాట అంటావా.?’ అంటూ జనసేనాని మీద విరుచుకుపడిపోతున్నారు.
కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాల కారణంగా అతలాకుతలమయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే చేసి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీలో వరద బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సాయం తదితర అంశాల గురించి మాట్లాడటం సంగతెలా వున్నా, సభలో లేని ప్రతిపక్షం గురించి నానా యాగీ చేయడమే సరిపోతోంది. అధికార పార్టీకి చెందిన మెజార్టీ నేతలు ఇదే పనిలో బిజీగా వున్నారు. కొందరు వైసీపీ నేతలు గ్రౌండ్ లెవల్‌లో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి.
ఇలాంటి సమయాల్లో ముఖ్యమంత్రి, బాధిత ప్రజలకు అండగా వుండాలి. వీలైనంతవరకు వరద బాధిత ప్రజలకు అందుబాటులో వుండాలి. కుదిరితే అక్కడే మకాం వెయ్యాలి కూడా. కానీ, ‘ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు.. ఏం చేస్తున్నామన్నది ముఖ్యం.. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించాం.. వరద బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటున్నాం..’ అంటూ వైసీపీ చెబుతోంది.
అయినాగానీ, ‘వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి..’ అనే విమర్శలపై వైసీపీ సరైన సమాధానం చెప్పుకోలేకపోతోందన్నది నిర్వివాదాంశం. ‘జనసేన చెబుతున్నది తప్పు.. ఆయన వర్క్ ఫ్రమ్ హోం చీఫ్ మినిస్టర్ కాదు.. పబ్బీ గేమ్ చీఫ్ మినిస్టర్..’ అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన మీద, వైసీపీ మీద సెటైర్లేస్తున్నారు. ఎవరి గోల వారిది.