ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి వెళ్లినా అక్కడ పూజ హెగ్డే పేరే వినిపిస్తోంది .. ఆమె పట్ల అక్కడి ప్రేక్షకులలో క్రేజ్ కనిపిస్తోంది. అందంతో పాటు అదృష్టాన్ని కూడా ఆమె వెంటేసుకుని తిరుగుతోంది. అందం .. అభినయం .. అదృష్టంతో పాటు లౌక్యం కూడా ఉన్నవారిని ఆపడం కష్టం. ఇప్పుడు పూజ హెగ్డే విషయంలోనూ అదే జరుగుతోంది. తెలుగులో ఆమె ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్టే అనే విషయం స్పష్టమైపోయింది. ‘అరవింద సమేత’ .. ‘మహర్షి’ .. ‘గద్దలకొండ గణేశ్’ .. ‘ అల వైకుంఠపురములో’ .. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలే అందుకు నిదర్శనం.
ఇలా వరుస హిట్లతో .. విజయాలతో పూజ హెగ్డే దూసుకుపోతోంది. వచ్చే ఏడాదిలో పాన్ ఇండియా హీరోయిన్ గా ఆమె మరింతగా తన దూకుడు చూపనుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. “నేను ఎప్పుడూ కూడా ఒక భాషకి చెందిన ఆర్టిస్ట్ గా మాత్రమే ఉండిపోకూడదని అనుకున్నాను. అనుకున్నట్టుగానే సౌత్ లోను .. నార్త్ లోను సినిమాలు చేస్తున్నాను. నేను అనుకున్నట్టుగానే నా ప్రయాణం కొనసాగుతోంది. దేవుడు చాలా గొప్పవాడు .. నా టాలెంట్ ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నన్ను ఎంతోగానో ప్రేమించే అభిమానులను ఇచ్చాడు.
అందువల్లనే నన్ను నేను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నాను. మరింత కష్టపడటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. హార్డ్ వర్క్ చేసేవారినే విజయాలు వెతుక్కుంటూ వస్తాయనే విషయాన్ని నేను నమ్ముతుంటాను. అందువలన హార్డ్ వర్క్ చేస్తూ వెళతాను. ఒక యాక్టర్ కి ఎప్పటికప్పుడు ఒక ప్రాజెక్టు పూర్తి కాగానే మరో ప్రాజెక్టు ఏమిటి? అని ప్రశ్నించుకోవడం నా కెరియర్ బిగినింగ్ నుంచి చూస్తున్నాను. ఇంతవరకూ అయితే తరువాత సినిమా ఏంటి? అనే ప్రశ్న తలెత్తకుండానే నాకు అవకాశాలు వస్తున్నాయి. ఈ గ్రాఫ్ ను ఇలా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం పూజ హెగ్డే ప్రభాస్ సరసన చేసిన ‘రాధే శ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 14వ తేదీన విడుదలవుతుంది. ఆ తరువాత ఫిబ్రవరి 4వ తేదీన ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమిళంలో విజయ్ సరసన చేసిన ‘బీస్ట్’ కూడా వచ్చేఏడాదిలో వస్తున్న పెద్ద సినిమానే. హిందీలో ‘సర్కస్’ .. ‘కభీ ఈద్ కభీ దివాళి’ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులు చూస్తుంటే మాత్రం ఇప్పట్లో పూజ కెరియర్ కి ఎలాంటి ఢోకా లేదనే విషయం అర్థమైపోవడం లేదూ!