చిరు – వెంకీ లతో నటించనున్న సల్మాన్..!

పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు రూపొందుతున్న తరుణంలో ప్రేక్షకులు భాషా బేధాలు లేకుండా ఆదరిస్తున్నారు. నటీనటులు సైతం స్క్రిప్ట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు ఎప్పటి నుంచో హిందీ చిత్రాల్లో కనిపిస్తూ వస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరోలు తెలుగు చిత్రాల్లో కనిపించడం చాలా అరుదనే చెప్పాలి.

సంజయ్ దత్ అప్పుడెప్పుడో నాగార్జున హీరోగా చేసిన ‘చంద్రలేఖ’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తే.. ఇటీవల సునీల్ శెట్టి ‘మోసగాళ్ళు’ మూవీలో నటించారు. అజయ్ దేవగన్ ‘RRR’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అమీర్ ఖాన్ – షారుక్ ఖాన్ – సల్మాన్ ఖాన్ – హృతిక్ రోషన్ వంటి హీరోలు డబ్బింగ్ సినిమాలతో అలరించారు. అయితే ఇప్పుడు సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయడానికి సిద్ధమయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. లేటెస్టుగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన కండలవీరుడు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన సమాచారం రివీల్ చేశారు. త్వరలోనే విక్టరీ వెంకటేష్ తో కలిసి వర్క్ చేయబోతున్న విషయాన్ని సల్మాన్ మీడియాకి వెల్లడించారు.

తన బావమరిది ఆయుష్ శర్మ తో కలిసి సల్మాన్ ఖాన్ నటించిన ‘అంతిమ్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. త్వరలో చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయబోతున్నానని తెలిపారు. చిరంజీవి – రామ్ చరణ్ లతో మంచి సాన్నిహిత్యం ఉందని.. ‘గాడ్ ఫాదర్’ లో నాకు రోల్ ఆఫర్ చేసినప్పుడు.. దాని గురించి తానేమీ అడగలేదని.. ఎన్ని కాల్షీట్లు కావాలిని అడిగానని స్టార్ హీరో చెప్పారు.

ఇంకా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. వెంకటేష్ కూడా తనకు బాగా క్లోజ్ అని.. త్వరలో ఆయనతో కూడా ఓ మూవీ చేయబోతున్నానని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘లూసిఫర్’ ఆధారంగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుంది. ఒరిజినల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను తెలుగులో సల్మాన్ కనిపించనున్నారు. అయితే వెంకీతో కలిసి ఏ సినిమా చేస్తారు? ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇన్నాళ్లూ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సల్మాన్ ఖాన్.. ఇప్పుడు రెండు బ్యాక్ టూ బ్యాక్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండటం విశేషమనే చెప్పాలి.