‘పుష్ప’ అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. అందుకే లేట్ అయింది..!

అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప: ది రైజ్”. ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలోరూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాని డిసెంబర్ 17న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ట్రైలర్ ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ షాక్ ఇచ్చారు.

ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు ‘పుష్ప’ పార్ట్-1 ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. అయితే చెప్పిన సమయానికి మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేయలేకపోయారు. అనుకోని సాంకేతిక సమస్యల కారణంగా విడుదల చేయలేకపోతున్నామని.. ఆలస్యానికి ఫ్యాన్స్ ను క్షమాపణలు కోరారు. తదుపరి అప్డేట్ కోసం చూస్తూ ఉండమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

గంధపు చెక్కల స్మగ్లర్ గా పుష్పరాజ్ మాస్ అవతారాన్ని చూడాలని- తగ్గేదే లే అంటూ తనదైన శైలిలో చెప్పే డైలాగ్స్ వినాలని ఆశగా వేచి చూసిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నిర్మాతల మీద ఫైర్ అవుతున్నారు. కాకపోతే ఎప్పుడొచ్చినా ‘పుష్ప: ది రైజ్’ ట్రైలర్ ఏమాత్రం తగ్గదని ధీమాగా ఉన్నారు. ఇక్కడ పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. అందుకే లేట్ అయ్యుండొచ్చని కామెంట్స్ పెడుతున్నారు.

ఇప్పటికే విడుదలైన పుష్ప ట్రైలర్ టీజ్ మాస్ ఫెస్టివల్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. ఇక అసలు ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ – సునీల్ – అనసూయ భరద్వాజ్ – అజయ్ ఘోష్ – ధనుంజయ – రావు రమేష్ – అజయ్ – శత్రు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముత్తం శెట్టి మీడియా నిర్మాణ భాగస్వామిగా ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ‘పుష్ప: ది రైజ్’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.