బాలకృష్ణ తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన కథలలో .. విలక్షణమైన పాత్రలలో కనిపించారు. ఎన్నో పవర్ఫుల్ పాత్రలలో మెప్పించారు. ఏ పాత్రను చేసినా ఆ పాత్రను బాలయ్య తప్ప మరెవరూ అలా చేయలేరు అనుకునేలా చేశారు. ఇటు పోలీస్ ఆఫీసర్ పాత్రలు .. అటు ఫ్యాక్షన్ పాత్రలు .. ఒక వైపున మోతుబరి రైతు పాత్రలు .. మరో వైపున పల్లెటూరి బుల్లోడి పాత్రలలో ఆయన తనకి తిరుగులేదని నిరూపించుకున్నారు.
అయితే ఈ సారి ఆయన కొత్తగా .. ఇంతకుముందుకంటే భిన్నంగా అఘోర పాత్ర చేశారు. ‘అఖండ’ సినిమా పట్ల అందరికీ ఈ స్థాయి ఆసక్తి పెరడగడానికి కారణం ఈ పాత్రనే.
సాధారణంగా తెరపై అఘోర పాత్రను చేయడానికి ఎవరూ కూడా సాహసించరు. ఆ పాత్రను ఎలా డిజైన్ చేస్తారో .. ఎలా చూపిస్తారో .. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వంటి సందేహాలు ఎన్నో ఉంటాయి. అందువలన ఇలాంటి పాత్రలు చేయడానికి చాలామంది వెనుకాడతారు.
కానీ బాలకృష్ణ ఏ విషయాన్ని కూడా భూతద్దంలో నుంచి చూడరు. తనకి నచ్చిన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయనకి అలవాటు. అందువలన ఆ పాత్రను గురించి సుదీర్ఘమైన చర్చలు జరపకుండానే ఓకే అనేశారు .. తనవైపు నుంచి ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేశారు.
ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. బాలకృష్ణ లుక్ .. ఆయన యాక్టింగ్ కి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
బోయపాటి టేకింగ్ .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పుకుంటున్నారు. ‘అఖండ’ను చూసిన వాళ్లంతా ఈ సినిమా టీమ్ ని ఎంతగానో అభినందిస్తున్నారు. బాలకృష్ణ నటన పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కూడా తన స్పందనను తెలియజేశారు.
‘అఖండ’ సినిమా అద్భుతంగా ఉంది. అప్పుడు తాతగారు .. ఇప్పుడు నాన్నగారు సినిమా పరిశ్రమ స్టాండర్డ్స్ ను పెంచడంలో కీలకమైన పాత్రను పోషించారు. గతంలో నాన్నగారు చేసిన సినిమాలకి మించి ఈ సినిమా ఉంది. నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కూడా డెఫినెట్ గా ఈ సినిమాను చూడాలి. ఈ సందర్భంగా మా మదర్ ను .. ఫాదర్ ను కంగ్రాట్యులేట్ చేయాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.