టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఒకే నెలలో నాలుగు చిత్రాల షూటింగ్స్ చేస్తున్న స్టార్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. కుర్ర హీరోలే ఈ రోజుల్లో ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తుంటే.. ఆరు పదులు దాటిన వయస్సులో చిరు దూకుడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అదే సమయంలో మెగాస్టార్ గెటప్ విషయంలో సినిమా సినిమాకు వేరియేషన్ ఎలా చూపిస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ లుక్స్ పరంగా హెయిర్ స్టైల్ – కాస్ట్యూమ్స్ విషయంలో ప్రేక్షకులకు కొత్తదనం కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని కోసం ఒక్కో సినిమాకు కొన్ని నెలల సమయం కేటాయిస్తున్నారు.
‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు వింటేజ్ లుక్ కోసం చాలా రోజులుగా లాంగ్ హెయిర్ తో ఉన్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించడానికి చాలా కష్టపడ్డారు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్.. ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా కనిపించడానికి చాలా కేర్ తీసుకుంటున్నారు. ‘పుష్ప’ చిత్రంలో మాస్ లుక్ కోసం అల్లు అర్జున్ రెండేళ్లుగా గుబురు గడ్డాన్ని మెయింటైన్ చేస్తున్నారు.
ఇలా స్టార్ హీరోలందరూ సినిమాలో రూపురేఖలు మార్చుకోవడానికి ఏళ్ల తరబడి కష్టపడుతుంటే.. చిరంజీవి మాత్రం లుక్ కోసం ఫ్యాషన్ డ్రెస్ మార్చుకునే ఓల్డ్ టెక్నిక్ ని ఫాలో అవుతున్నారని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆచార్య’ కోసం స్లిమ్ గా రెడీ అయిన చిరు.. ‘గాడ్ ఫాదర్’ ‘మెగా 154’ ‘భోళా శంకర్’ చిత్రాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు.
ఓవైపు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తూ.. మరోవైపు మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ – కెఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా ఒక్కో షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ గ్యాప్ లో మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ షూటింగ్ కూడా చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తుండటం పట్ల సినీ అభిమానులు హ్యాపీగా ఉన్నప్పటికీ.. లుక్ పరంగా వైవిధ్యం ఎలా చూపిస్తారని ఆలోచిస్తున్నారు.
ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు కాబట్టి స్టైలింగ్ లో పెద్దగా మార్పులు చూపించలేరు. డ్రెస్సింగ్ లో తప్ప హెయిర్ స్టైల్ లేదా బాడీ పరంగా వేరియేషన్ చూపించడం కష్టం. విగ్ ని ఉపయోగిస్తే హెయిర్ స్టైల్ లో కాస్త చేంజ్ కనిపించొచ్చు. ప్రస్తుతానికి నాలుగు సినిమాల్లోనూ చిరు లుక్ ఒకేలా ఉంటుందని అంటున్నారు.
అయితే మెగాస్టార్ లుక్స్ పరంగా కాకుండా తన బాడీ లాంగ్వేజ్ ద్వారా ప్రతి పాత్రకు అవసరమైన వ్యత్యాసాన్ని తీసుకువస్తారని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకప్పుడు ఏకకాలంలో సినిమాలు చేస్తూ.. కేవలం డ్రెస్సింగ్ – బాడీ లాంగ్వేజ్ తో ఒక్కో సినిమాకి ఒకలా కనిపించేవారు. ఇప్పుడు ‘భోళా శంకర్’ ‘గాడ్ ఫాదర్’ సినిమాలలో రెండు గెటప్స్ లో కనిపించాల్సి ఉంది. ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్స్ అయిపోతే వాటిపై దృష్టి పెడతారని అంటున్నారు.
‘ఆచార్య’ సినిమా షూటింగ్ ప్యాచ్ వర్క్ మాత్రమే ఉంది కాబట్టి.. రాబోయే రోజుల్లో చిరంజీవి మిగతా మూడు చిత్రాల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ‘భోళా శంకర్’ లో కొన్ని సీన్స్ లో గుండుతో కనిపిస్తారని టాక్ ఉంది. దీని కోసం ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా జరిగిందని అంటున్నారు. ఇక బాబీ సినిమాలో లుంగీ కట్టుకుని ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. ‘గాడ్ ఫాదర్’ లో లాంగ్ కోట్ హ్యాట్ ధరించబోతున్నారు. ఈ విధంగా మెగాస్టార్ ఒక్కో సినిమాలో ఒక్కో గెటప్ లో అలరించనున్నారని తెలుస్తోంది.