పవన్ – వెంకటేష్ మళ్లీ చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – విక్టరీ వెంకటేష్ మళ్లీ కలిసి నటిస్తారా? .. `ఓ మై గాడ్` రీమేక్ లో నటించిన ఈ ఇద్దరు ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా రీమేక్ ని చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే… బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం `ఓ మై గాడ్`. తనని ప్రశ్నించిన ఓ సగటు మనిషికి అండగా నిలబడేందుకు ఆ దైవమే భువికి కదలి వస్తే.. అతనికి తెలియకుండా అండగా నిలిస్తే ఏంటన్న కథాంశంతో సరికొత్త పంథాలో ఆలోచనాత్మకంగా తెరకెక్కిన చిత్రం `ఓ మై గాడ్`. అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరేష్ రావల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే చిత్రాన్ని ప్రాంతీయ భాషల్లోనూ రీమేక్ చేశారు.

కన్నడలో సుదీప్ ఉపేంద్ర కలసి చేయగా తెలుగులో పవర్స్టార్ పవన్ కల్యాణ్ … శ్రీకృష్ణుడిగా అక్షయ్ కుమార్ పాత్రలో నటించగా.. విక్టరీ వెంకటేష్ .. పరేష్ రావల్ పాత్రలో నటించారు. `గోపాల గోపాల` పేరుతె కిషోర్ కుమార్ పార్ధసాని రూపొందించిన ఈ చిత్రం తెలుగులోనూ అనూహ్య విజయాన్ని సాధించింది. తాజాగా `ఓ మై గాడ్` చిత్రానికి సీక్వెల్ ని రూపొందిస్తున్నారు. 2012లో వచ్చిన `ఓ మై గాడ్`లో శ్రీ కృష్ణుడిగా కనిపించిన అక్షయ్ కుమార్ తాజా సీక్వెల్ లో మాత్రం మహా శివుడిగా కనిపించబోతున్నారు.

ఈ సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ముంబైలోని బాంద్రాలోని టెర్మనస్లో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్షయ్ గెటప్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శివుడి తరహాలో తలపై సిగ కనిపిస్తోంది. బైగీ కుర్తా… బ్లూ కలర్ హాఫ్ పైజమా.. కొల్హాపురి చెప్పులు వేసుకుని అక్షయ్ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. అక్షయ్ ఫ్యాన్స్ ఈ వీడియోకు శవ స్త్రోత్రం సాంగ్ ని యాడ్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోని షేర్ చేసిన అక్షయ్ `హర హర మహదేవ్ ` అంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. ఇదిలా వుంటే ఈ సినిమాని తెలుగులో మళ్లీ రీమేక్ చేస్తారా? చేస్తే అందులో పవన్ కల్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.