దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ”ఆర్.ఆర్.ఆర్”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022 జనవరి 7వ తేదీన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
RRR చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు – ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ను తీసుకొచ్చాయి. ఇక నెల రోజుల ముందే ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిన జక్కన్న అండ్ టీమ్.. వరుస అప్డేట్స్ తో సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా రాజమౌళి తోపాటుగా చరణ్ – తారక్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ.. నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇక రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి RRR టీమ్ మేకింగ్ వీడియోలను వదులుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన వీడియో విడుదల చేయగా.. లేటెస్టుగా రామ్ చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్ర మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
రామరాజు పాత్ర కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని ఈ మేకోవర్ వీడియోలో చూడొచ్చు. ఇందులో చెర్రీ మూడు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు. దీం కోసం కెమెరా వెనక చెర్రీ తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం.. జక్కన్న సమక్షంలో సీన్స్ రిహాసల్స్.. తనకు జోడీగా నటించిన అలియా భట్ తో ముచ్చట్లు వంటివి ఈ వీడియోలో చూపించారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం రామ్ చరణ్ బాగా కష్టపడినట్లు అర్థం అవుతుంది. ఈ సినిమాతో ‘మెగా పవర్ స్టార్’ కాస్తా ‘పాన్ ఇండియా స్టార్’ గా గుర్తింపు తెచ్చుకుంటారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు మహావీరుల నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.