ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్`. సుకుమార్ – బన్నీల కలయికలో చేసిన మూడవ సినిమా ఇది. అంతే కాకుండా వీరిద్దరి కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో చేసిన తొలి పాన్ ఇండియా మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ తొలి రోజు కొంత మిక్స్ డ్ టాక్ వినిపించినా ఆ తరువాత ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తూనే వుంది.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరాదిలో హిందీ వెర్షన్ 50 కోట్ల మైలు రాయిని దాటడం రికార్డుగా నిలిచింది. రష్మిక మందన్న హీరోయిన్ గా శ్రీవల్లి పాత్రలో డీగ్లామర్‌గా నటించిన ఈ మూవీకి ఉత్తరాదిలో పెద్దగా ప్రచారమే చేయలేదు. గతంలో వచ్చిన బన్నీ చిత్రాలు యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్ ని సాధించడం `పుష్ప`కు ప్రధాన బలంగా నిలిచి ఈ మూవీ ఉత్తరాదిలో రోజు రోజుకీ స్ట్రాంగ్ అవుతుండం విశేషం. బన్నీ కెరీర్లోనే భారీ వసూళ్ల దిశగా పయనిస్తున్న ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ అయిన వృధా ఖర్చు ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని తాజాగా ఐదు భాషల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. పార్ట్ 2 చిత్రీకరణ పూర్తి చేయాల్సి వుంది. ఇదిలా వుంటే పార్ట్ 1 కే దాదాపుగా మేకర్స్ 180 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇందులో వేస్టేజీ అంటే వృధా చేసిన మొత్తమే షాక్ కు గురిచేస్తోంది. 180 కోట్ల బడ్జెట్ తో తొలి పార్ట్ ని పూర్తి చేశారు. అయితే ఇందు కోసం 12 కోట్లు వృధా అయినట్టుగా తెలుస్తోంది. కొన్ని యాక్షన్ ఘట్టాలని అడవి నేపథ్యంలో చిత్రీకరించారు.
ఈ సీన్ కోసం వందల సంఖ్యలో ఆర్టిస్ట్ లని వాడారు. అయితే దానికి సంబంధించిన సన్ని వేశాలని ఎడిటింగ్ సందర్భంగా తొలగించేశారట. అలా తీసేసిన సన్నివేశాలు సీన్లు చాలానే వున్నాయట. వాటి విలువ అక్షరాలా 12 కోట్లు అని చెబుతున్నారు. అంతే కాకుండా రోజుకు 30 నుంచి 40 లక్షల దాకా ప్రొడక్షన్ ఖర్చు అయ్యేదని తెలిసింది. అంటే పది రోజులు వేస్ట్ అయితే ఖర్చు 4 కోట్లు కృష్ణార్పణం అయిపోతుంది. అలాంటిది 12 కోట్లు వేస్టేజ్ అయిందంటే ఏ రేంజ్లో వేస్ట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే `పుష్ప – 2` కోసం వినియేగించుకుందాం అని భావించిన సీన్లని కూడా పక్కన పెట్టడం.. అందులో కొన్ని యూట్యూబ్ లో లీక్ కావడం.. మరికొన్ని ఎడిటింగ్ చేయకుండానే పక్కన పడేయడం చేశారట. దీంతో `పుష్ప` పార్ట్ 1 విషయంలో వేస్టేజ్ ఓ రేంజ్ లో జరిగిందని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకుని వుంటే బడ్జెట్ హద్దులు దాటేది కాదని మరో వాదన వినిపిస్తోంది.
ఇదే వేస్టేజ్ పార్ట్ 2 విషయంలోనూ జరిగితే లాభాల మాట దేవుడెరుగు.. ఫలితం తారుమారైతే నిర్మాతల పరిస్థితి ఏంటని అంతా అవాక్కవుతున్నారు. ఏది ఏమైనా పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతోంది కాబట్టి పార్ట్ 2 విషయంలో అయినా ఈ వేస్టేజీ విషయంలో జాగ్రత్తలు తీసుకుని అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేస్తే మంచిదని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు.