పాపం ‘మహాసముద్రం’ సినిమా దెబ్బకి తన అడ్రస్ సినీ రంగంలో గల్లంతయ్యిందనుకున్నాడో ఏమో, ఆ ఆవేదనలో సోషల్ మీడియా వేదికగా బూతు ట్వీటు ద్వారా పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్ని కొనితెచ్చుకున్నాడు. మొన్నామధ్యన సినిమా టిక్కెట్ల వ్యవహారంలో సిద్దార్ధ లాజికల్ ట్వీట్లతో ఆకట్టుకున్నాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా వుండే సినీ సెలబ్రిటీల్లో సిద్దార్ధ కూడా ఒకరు. ఆయన వేసే ట్వీట్లు ఆలోచింపజేస్తాయి. కాస్త ‘రెబల్’ కోణంలో వుంటాయి కూడా. కంగనా రనౌత్, స్వరా భాస్కర్, రామ్ గోపాల్ వర్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ తరహా సోషల్ సెలబ్రిటీలు చాలామందే వున్నారు.
ఇక, ఇప్పుడు సిద్దార్ధ ట్వీటు గురించి మాట్లాడుకుందాం. ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, మొన్నీమధ్యనే ప్రధాని నరేంద్ర మోడీకి, పంజాబ్ గడ్డపై ఎదురైన పరాభవంపై తీవ్రంగా స్పందించింది. సరే, నరేంద్ర మోడీ పబ్లిసిటీ స్టంట్లు చేశారా.? పంజాబ్ ప్రభుత్వం పైత్యం ప్రదర్శించిందా.? ఇందులో కేంద్ర హోం శాఖ వైఫల్యమెంత.? అన్నది వేరే చర్చ.
ప్రధాని రక్షణపై అందరికీ అనుమానమొచ్చింది. దేశ ప్రధానికి రక్షణ కల్పించలేకపోవడమంటే అది బాధాకరమైన విషయం. అంతవరకూ ఓకే. కానీ, ప్రధానికే భద్రత లేదంటే.. అంటూ దేశం మీద అసహనం వ్యక్తం చేయడం సైనా నెహ్వాల్ లాంటివారికి సబబు కాదు.
సైనా వ్యాఖ్యల్ని కొందరు సమర్థించొచ్చు, కొందరు వ్యతిరేకించొచ్చు. అదే ప్రజాస్వామ్యమంటే. ప్రజాస్వామ్యంలో చర్చ జరగాలి. సిద్దార్ధ కూడా సైనా నెహ్వాల్ వ్యాఖ్యల్ని ఖండించాడు. కానీ, ఈ విషయంలో ఆయన ఎంచుకున్న బూతు పదజాలమే విమర్శలకు తావిస్తోంది. వాడింది ‘డబుల్ మీనింగ్ పదం’. కానీ, ‘అబ్బే, అది బూతు కాదు..’ అంటూ సిద్దార్ధ వివరణ ఇచ్చుకున్న వైనం మరింత జుగుప్సాకరం.
ఓ మహిళను గౌరవించకపోయినా ఫర్వాలేదు, ఆమెను అవమానించడం ద్వారా సిద్దార్ధ చెయ్యకూడని తప్పు చేసేశాడు. సైనా నెహ్వాల్ క్రీడా రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించింది. ఆమెపై జుగుప్సాకరమైన పదజాలం వాడాలని సిద్దార్ధకి ఎలా అనిపించిందో ఏమో.! సోషల్ మీడియాకి పట్టిన చీడగా సిద్దార్ధ వైఖరిని అభివర్ణిస్తే అది ఏమాత్రం తప్పు కాదు.