నారా లోకేశ్ కు కోవిడ్ పాజిటివ్..! ట్విట్టర్ లో వెల్లడి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా బారిన పడ్డారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా లక్షణాలు లేవని.. టెస్టులో పాజిటివ్ రావడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని ఆయన తెలిపారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఈ సందర్భంగా లోకేశ్ కోరారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న దశలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

మరోవైపు.. కరోనా తీవ్రత నేపథ్యంలో ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. దేశంలో అనేక రాష్ట్రాలు కోవిడ్ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయాన్ని లోకేశ్ ప్రస్తావించారు. ఏపీలో కోవిడ్ కేసులు పది రోజుల్లోనే 500 నుంచి 5000 వరకు పెరిగాయని.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడొద్దని.. విద్యాసంస్ధలకు సెలవులు ప్రకటించాలని ఆయన కోరారు.