యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా కు ఉన్న బజ్ అంతా ఇంతా కాదు. కేజీఎఫ్ మొదటి పార్ట్ తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 ను అంతకు మించి తెరకెక్కించినట్లు టీజర్ తోనే చెప్పకనే చెప్పాడు. కేజీఎఫ్ 2 టీజర్ చూసిన తర్వాత సలార్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటూ అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. కేజీఎఫ్ 2 సినిమా విడుదల అయిన తర్వాత సలార్ స్థాయి మరింతగా పెరిగినా ఆశ్చర్యం లేదు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్. ఆయన తో కేజీఎఫ్ వంటి భారీ యాక్షన్ సినిమాను తీసిన దర్శకుడి సినిమా అంటే ఖచ్చితంగా ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.
సలార్ సినిమా పై ఉన్న బజ్ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ మొదలు కాలేదు. కాని ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసేందుకు పలు ప్రముఖ ఓటీటీ లు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మూడు ఓటీటీలు వందల కోట్ల ఆఫర్ ను సలార్ మేకర్స్ కు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని భాషల్లో కూడా సలార్ కు విపరీతమైన బజ్ ఉంది. కనుక తెలుగు.. తమిళం.. కన్నడం.. మలయాళం మరియు హిందీ భాషలతో పాటు ఇంకా కొన్ని ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేసేందుకు గాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా సలార్ కు గాను రెండు వందల కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక సౌత్ సినిమా కు ఆ స్థాయిలో ఓటీటీ రేటు రావడం ఇదే ప్రథమం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఈమద్య కాలంలో బాలీవుడ్ సినిమాలు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా ఆ స్థాయిలో బిజినెస్ చేయలేక పోతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రెండు వందల కోట్లు అంటే మామూలు విషయం కాదు. నిర్మాతలు దాదాపుగా సలార్ కోసం 300 కోట్ల వరకు ఖర్చు చేస్తూ ఉండవచ్చు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో దాదాపుగా వంద కోట్ల వరకు ప్రభాస్ పారితోషికం ఉంటుందని అంటున్నారు. మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమాకు కేవలం ఓటీటీ బిజినెస్ 200 కోట్ల రూపాయలు జరిగింది అంటే ఇక థియేట్రికల్ రైట్స్ కు మరియు శాటిలైట్ రైట్స్ కు మరెంత గా వచ్చే అవకాశం ఉందో ఊహించుకుంటేనే బాబోయ్ అనిపిస్తుంది. ఈ లెక్కలు కనుక నిజమే అయితే సలార్ సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయం. ప్రభాస్ సలార్ మాత్రమే కాకుండా ప్రస్తుతం చేస్తున్న ఇతర సినిమాలు మరియు ముందు ముందు చేయబోతున్న సినిమాలు అన్నీ కూడా ఇదే రేంజ్ బిజినెస్ ను చేసే అవకాశాలు లేకపోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.