సల్మాన్ మూవీలో విక్టరీ వెంకటేశ్!

వెంకటేశ్ ను ఒకసారి గమనిస్తే తాను స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిననీ .. స్టార్ హీరోనని బిగదీసుకుని కూర్చోవడం ఎప్పుడూ ఎక్కడా కూడా కనిపించదు. ఇన్నేళ్ల కెరియర్లో ఎన్నో సినిమాలు చేసిన ఆయన ఇంతకాలంగా ఇక్కడ పొడించిందేమీ లేదని ఒక వేదికపై అనడం ఆయన సింప్లి సిటీకి నిదర్శనం. కథ బాగుంటే రీమేకులు చేయడానికీ .. మల్టీ స్టారర్లు చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా వెనుకాడరు. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో .. ఇతర భాషల్లోని హీరోలతోను అదే ఫ్రెండ్షిప్ ను కొనసాగిస్తూ ఉంటారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తో వెంకీకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువల్లనే ఆయన సినిమాలో వెంకటేశ్ ఒక కీలకమైన రోల్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ హీరోగా ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే ఒక సినిమాను ప్లాన్ చేశాడు.

సల్మాన్ సరసన నాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఆ సినిమాకి సంబంధించిన అగ్రిమెంట్ పై ఆమె సైన్ చేసింది కూడా. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందనే అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా ఆగిపోలేదట .. కరోనాతో పాటు కొన్ని ఇతర కారణాల వలన ప్రాజెక్టు ఆలస్యమైందట అంతే. అయితే ఈ గ్యాపులో ఈ సినిమా టైటిల్ ను మార్చేశారట. కొత్త టైటిల్ గా ‘భాయ్ జాన్’ ను సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. మార్చి 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఫ్యామిలీ డ్రామా జోనర్లో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమా లోనే ఒక కీలక పాత్రలో వెంకటేశ్ సందడి చేయనున్నారన్న మాట.

‘నారప్ప’ .. ‘దృశ్యం’ రీమేకులతో హిట్లు కొట్టేసిన వెంకటేశ్ తన తాజా చిత్రంగా ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఏప్రిల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత ఆయన సురేశ్ ప్రొడక్షన్స్ లో మరో రీమేకులో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే .. తమిళంలో విజయ్ సరసన ఆమె చేసిన ‘బీస్ట్’ విడుదలకి రెడీ అవుతోంది.

త్రివిక్రమ్ – మహేశ్ ప్రాజెక్టు కోసం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తన తాజా చిత్రమైన ‘రాధేశ్యామ్’ కోసం అభిమానులతో పాటు ఆమె కూడా ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే పూజను పట్టుకోవడం కష్టమే!