రీల్ విలన్ కు ప్రపోజల్స్ అలా వస్తుంటాయట

టాలీవుడ్ లో టాప్ విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. పోలీసు అధికారిగా ఇట్టే సూట్ అయ్యే నటుల్లో ఒకరు సంపత్ రాజ్. గంభీరమైన స్వరం.. అంతకు మించి తెర మీద నిండుగా కనిపించే రూపంతో చాలా తక్కువ వ్యవధిలోనే తెలుగు ప్రేక్షకులకు ఇట్టే కనెక్టు అయిన నటుడు ఆయన. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు అప్పుడప్పడు వార్తల్లో వస్తుంటాయి.

ఆయన విడాకులు తీసుకోవటం.. ఒక నటితో సహజీవనం చేసినట్లుగా వార్తలు రావటం.. అసలు అదంతా పచ్చి అబద్ధమని.. తనను ఎప్పుడు అలా చూడలేదని గతంలో వెల్లడించిన ఆయన తాజాగా ఒక ప్రముఖ చానల్ లో ఇంటర్వ్యూ కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు.. విడాకులు తీసుకున్న తనకు ఇండస్ట్రీకి చెందిన వారి నుంచి వచ్చే ప్రపోజల్స్ తో పాటు.. తాను వాటికి ఎలా రియాక్టు అవుతానన్న విషయాల్ని వెల్లడించారు. ప్రస్తుతం లేట్ ఫార్టీస్ లో ఉన్న ఆయన తాను ఒంటరిగా ఉంటానని చెబుతూ.. పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఇంతకూ రీల్ మీద విలనిజంతో చెలరేగిపోయే సంపత్ కు ఆ తరహా ప్రపోజల్స్ ఎలా వస్తాయన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

‘మీరు డైవర్సీ అని తెలిసింది. మనం ఎక్కడైనా కలుద్దామా?అని చాలామంది అడుగుతుంటారు. కానీ.. నేను అలాంటివి ప్రోత్సహించలేదు. ఎందుకంటే నా దృష్టంతా నా కూతురుపైనే. ఒకవేళ నేను అలా వెళ్లిపోతే నా కూతుర్ని పెంచి పెద్దచేయాలని నేను తీసుకున్న నిర్ణయానికి అర్థం ఉండదు.

ఇండస్ర్టీ బయట నుంచి కూడా ప్రపోజల్స్ వచ్చాయి. నేను పట్టించుకోలేదు. నాకు 45 ఏళ్లప్పుడు ఒక రిలేషన్షిప్ ట్రై చేశాం. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ విషయం నా కూతురుకు కూడా తెలుసు’ అని వెల్లడించారు.

జీవితంలో ఎప్పుడు ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందని.. ఎందుకలా జరుగుతుందని తాను ప్రశ్నించుకోలేదన్న సంపత్.. సినిమా రంగంలోకి వచ్చి తనకు ఇప్పటికి 20 ఏళ్లు అయ్యిందని.. తన ప్రైమ్ ఏజ్ లో ఒంటరిగానే ఉన్నానని.. ఆ ఒంటరితనం అలవాటైందన్నారు.

‘‘ఈ స్పేస్ను ఇంకొకరితో షేర్ చేసుకోవాలంటే… అది ఎలా ఉంటుందో తెలియదు నాకు. సో… మళ్లీ పెళ్లి చేసుకొంటే బాగుంటుందా? బాగుండదా? అని నాలో భయం (నవ్వు). ప్రస్తుతానికి హాయిగా ఉన్నాను కదా! అది చాలు! మా అమ్మాయి చెబుతుంటుంది… ‘నాన్నా… ట్రై చేయండి’ అని. ‘దానంతట అదే వస్తే చూద్దాం’’ అని అంటానని సంపత్ చెప్పారు.