మోటార్లకు మీటర్లపై కేసీఆర్ అసత్యాలు నిరూపిస్తా..! రాజీనామాకు సిద్ధమా..?: బండి సంజయ్

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. విలేకరుల సమావేశంలో మాట్లుడుతూ.. విద్యుత్ సంస్కరణల్లో 2020 నాటి వివరిస్తూ రైతులను కేసీఆర్ రెచ్చగొడుతున్నారు. 2021 ఫిబ్రవరిలో కేంద్రం మార్పులు చేసిందని పత్రాలు చూపి వివరించారు.. 2022 జనవరి 3న రాష్ట్రాలకు పంపిన మార్గదర్శకాల్లో మూడో పేజీ క్లాజ్ 4.7లో వ్యవసాయానికి మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టంగా ఉందని బండి సంజయ్ అన్నారు.

ఈ విషయాన్ని నిరూపిస్తానని.. గన్ పార్క్ వద్దకు కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ చేశారు. మోటార్లు పెట్టాలని ఉన్నట్టు నిరూపించకపోతే రాజీనామా చేస్తావా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్టును కేసీఆర్ చదువుతున్నారని.. రాహుల్ గాంధీ, కేసీఆర్ దోస్తులయ్యారని.. త్వరలో ప్రగతి భవన్ నుంచి గాంధీ భవన్ కు వెళ్తారని అన్నారు. రాఫెల్ కుంభకోణం జరగలేదని సుప్రీంకోర్టు చెప్పినా అవినీతి జరిగిందంటున్న కేసీఆర్ కోర్టు ధిక్కారమే అని మండిపడ్డారు.