అవైడ్ చేసిందెవరో తెలుసంటావ్.. పేర్లు మాత్రం చెప్పవేం విష్ణూ..!

టాలీవుడ్ హీరో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మంగళవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటీవల చిరంజీవి నేతృత్వంలో జగన్ ని కలిసిన సినీ ప్రముఖుల బృందంలో మంచు హీరోలు ఎందుకు లేరనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. విష్ణు ముఖ్యమంత్రితో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సమావేశం అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన విష్ణు.. ఇది పర్సనల్ మీటింగ్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.

అంతేకాదు సీఎంతో జరిగిన సినీ పెద్దల భేటీకి మిస్ కమ్యూనికేషన్ వల్లే తన తండ్రి మంచు మోహన్ బాబు వెళ్లలేదని విష్ణు అన్నారు. సీఎంఓ నుంచి మోహన్ బాబుకు ఆహ్వానం వచ్చినప్పటికీ అది ఆయనకు అందజేయలేదని.. ఇదంతా ఎవరు చేసారో.. ఎవరు అవైడ్ చేసారో కూడా తమకు తెలుసని సంచలన ఆరోపణలు చేసారు. ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలిలో దీనిపై మాట్లాడతానని అన్నారు.

విష్ణు మాట్లాడుతూ.. ”నాన్నగారు మొన్న జరిగిన మీటింగ్ కు మిస్ కమ్యూనికేషన్ వల్లే హాజరు కాలేకపోయారు. ఎక్కడ మిస్ కమ్యూనికేషన్ జరిగిందో మేమందరం మాట్లాడతాం. ఎందుకంటే పేర్నినాని గారితో మాట్లాడినప్పుడు ఆయన మాకు క్లారిటీగా చెప్పారు. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది. మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ హీరోలకూ వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ ఇన్విటేషన్ ని నాన్నగారికి అందజేయలేదు”

”దీనిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ – ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో మాట్లాడతా. నాన్నగారిని మీటింగ్ కి పిలవలేదు అనేది దుష్పచారం. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్.. ఒక లెజెండరీ యాక్టర్. ఆయనకు ప్రభుత్వం నుంచి వచ్చింది. కానీ అది రీచ్ అవకపోవడానికి కారణమేంటో.. ఎవరు ఇదంతా క్యారీ ఫార్వార్డ్ చేసారో.. ఎవరు అవైడ్ చేసారో ఇంటర్నల్ గా మాకు తెలుసు” అని అన్నారు.

మంచు మోహన్ బాబుకు సీఎం ఆహ్వానం అందకుండా చేసిందో తనకు తెలుసంటూనే.. వాళ్లెవరో మంచు విష్ణు చెప్పకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్న సపోర్ట్ తో ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించానని చెప్తున్న విష్ణు.. తన తండ్రిని అవైడ్ చేసింది ఎవరో చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఇండస్ట్రీలో సమస్యలన్నిటినీ అంతర్గతంగా పరీక్షించుకుంటామని చెప్తున్నప్పుడు.. తన తండ్రిని అవైడ్ చేసింది ఎవరో తెలుసని మీడియా ముందు చెప్పాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. అంతేకాదు ‘మా’ ఎన్నికలలో సమయంలో ‘లెట్ దెమ్ నో అంకుల్’ అంటూ సీనియర్ నరేష్ తో మంచు విష్ణు వారిస్తున్న ఫోటోని మీమ్ గా పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు.