పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో లైన్ లో పెడుతూ బిజీగా మారిపోయారు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే మరొక షూటింగ్ మొదలుపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచారు. కరోనా బ్రేక్స్ వేయకపోతే పవన్ స్పీడ్ కు ఈపాటికే బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాల చిత్రీకరణ పూర్తి చేసేవారే.
పాండమిక్ వల్ల లేట్ అవుతూ వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమా షూటింగ్ మంగళవారంతో కంప్లీట్ అయింది. పెండింగ్ ఉన్న సాంగ్ ని పూర్తి చేసిన పవన్.. ఈ క్రమంలో ప్యాచ్ వర్క్ ని కూడా ముగించారు. చివరి రోజున పవర్ స్టార్ ని కలవడానికి ఆయనతో సన్నిహితంగా ఉండే సినీ ప్రముఖులు సెట్స్ కి వచ్చినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ దర్శకులు హరీష్ శంకర్ – క్రిష్ జాగర్లమూడి కలిసి నవ్వుతున్న ఓ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. ఇందులో ‘భీమ్లా నాయక్’ సినిమాలోని పోలీసాఫీసర్ గెటప్ లో ఉన్న పవన్.. హరీష్ భుజం మీద చెయ్యేసి.. క్రిష్ చేయి పట్టుకొని కనిపిస్తున్నారు.
పవన్ తో తదుపరి చిత్రాలను డైరెక్ట్ చేస్తున్న ఇద్దరు దర్శకులతో ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసి.. బ్లాక్ బస్టర్స్ అందివ్వాలని కోరుతున్నారు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఈ పీరియాడికల్ అడ్వెంచర్ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వీరమల్లు’ చిత్రాన్ని తిరిగి సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు – కుతుబ్ షాహీల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇది పవన్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా.. ఫస్ట్ పీరియాడికల్ డ్రామా.
ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ‘వీరమల్లు’ సినిమా విడుదల కానుంది.
మరోవైపు హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేయనున్నారు పవన్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వీరి కాంబోలో రానున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్ అందించనున్నారు. అప్పుడెప్పుడో ప్రకటించబడిన ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో టైమింగ్ ఉన్నట్లే.. సినిమాకు కూడా టైమింగ్ ఉండాలని.. పవన్ చిత్రానికి సంబంధించిన అన్ని విశేషాలు సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తామని దర్శకుడు హరీష్ పేర్కొన్నారు.
ఇకపోతే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రానాతో కలిసి పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న భారీ స్థాయిలో విడుదల కానుంది. సితార ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – మాటలు అందించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు.