భీమ్లా తో నిత్యాకి అది సాధ్యమయ్యేనా?

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా భీమ్లా నాయక్ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాస్ జాతర అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వంద కోట్లు దాటి వసూళ్లను సొంతం చేసుకుంది. నైజాం ఏరియాతో పాటు ఓవర్సీస్ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదు అవుతుంది.

ఈ సమయంలో హీరోయిన్ నిత్యా మీనన్ గురించి తెగ చర్చ జరుగుతోంది. పవన్ సినిమాలో ఇతరులు ఎవరు ఉన్నా కూడా అభిమానులకు కనిపించరు. కాని సాదారణ ప్రేక్షకులు మాత్రం నిత్యా మీనన్ అప్పియరెన్స్ మరియు ఆమె పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. నిత్యా మీనన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా తన నటన ప్రతిభతోనే కెరీర్ లో ముందుకు వెళ్తుందని మరోసారి నిరూపించుకుంది.

భీమ్లా నాయక్ భార్య పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉన్నంతలో ఆమె మంచి నటనతో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఆమె ఉన్న సన్నివేశాల్లో ఆమె హైలైట్ అయ్యేంతగా నటించిందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నానితో అలా మొదలైంది అంటూ కెరీర్ ను ఆరంభించిన నిత్యా మీనన్ మొదటి సినిమా తోనే మల్టీ ట్యాలెంటెడ్ అనే ట్యాగ్ ను దక్కించుకుంది.

ఇన్నేళ్ల సినీ కెరీర్ లో స్కిన్ షో కు పూర్తిగా దూరం ఉన్న ముద్దుగుమ్మ ఈమె ఒక్కరే అంటూ అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. స్కిన్ షో కు ఓకే చెప్తే స్టార్ హీరోలు సైతం పిలిచి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. కాని ఈమెకు మాత్రం పెద్దగా స్కిన్ షో పై ఆసక్తి లేదు. దాంతో చిన్న సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇంకా విలన్ పాత్రల్లో కూడా కనిపించింది. ఆమద్య కాస్త డల్ అయినట్లుగా అనిపించిన నిత్యా మీనన్ తెలుగు లో రాదేమో అనుకున్నారు.

కానీ ఇటీవల వచ్చిన స్కైలాబ్ మరియు తాజాగా విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా లతో మరోసారి తన సత్తాను చాటుకుంది. అందుకే ఈమెకు తగ్గ పాత్రలు మళ్లీ ఈమె వద్దకు క్యూ కట్టే అవకాశాలు చాలా నే ఉన్నాయి అంటున్నారు. భీమ్లా నాయక్ సక్సెస్ వల్ల నిత్యా మీనన్ మళ్లీ తెలుగులో భారీగా కాకున్నా ఒక మోస్తరుగా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.