బాలీవుడ్ దిగ్గజ దర్శకుడి ఆఫీస్ లో బన్నీ.. పీరియాడిక్ మూవీ కోసం ప్లాన్స్..?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్.. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బన్నీ.. ఉత్తరాది మార్కెట్ లో ఊహించని వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘పుష్ప’ పార్ట్-1 తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్.. ఇప్పుడు బాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతున్నట్లు అర్థం అవుతోంది. ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సెట్ చేయడానికి ప్రయత్నాల్లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఈ నేపథ్యంలో సోమవారం అల్లు అర్జున్ ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీని మీట్ అవ్వడం ఈ ఊహాగానాలు బలం చేకూరేలా చేసింది. స్టోరీ నెరేషన్ కోసమే ముంబైలోని దిగ్గజ దర్శకుడి కార్యాలయానికి బన్నీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

సంజయ్ లీలా బన్సాలీ దక్షిణాది యోధుని ఆధారంగా ఒక పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారని.. ఇందులో అల్లు అర్జున్ హీరోగా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బన్నీ – సంజయ్ కలయిక జరిగిందని అంటున్నారు.

ఒకవేళ ఈ క్రేజీ కాంబోలో ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం పాన్ ఇండియా హీరోల్లో అందరికంటే బన్నీ ఒక మెట్టు ఎక్కినట్టే. ఎందుకంటే బాలీవుడ్ లోని అతిపెద్ద దర్శకుల్లో సంజయ్ లీలా బన్సాలీ ఒకరు. ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటారు.

ఇప్పుడు అల్లు అర్జున్ – సంజయ్ లీలా బన్సాలీల మధ్య సమావేశం తర్వాత వీరిద్దరి కలయికలో ఓ ప్రాజెక్ట్ రాబోతోందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్ అగ్ర దర్శకుడు – సౌత్ ఇండియా స్టార్ హీరో కలిసి పని చేస్తే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అద్భుతమైనది అవుతుంది. మరి త్వరలో ఈ కాంబినేషన్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

కాగా సంజయ్ లీలా బన్సాలీ ఇటీవలే ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంతో ప్రశంసలు అందుకున్నారు. త్వరలో రణ్ వీర్ సింగ్ తో ‘బైజు బావ్రా’ అనే మూవీ చేయనున్నారు. ‘రామ్ లీలా’ ‘బాజీరావ్ మస్తానీ’ మరియు ‘పద్మావత్’ తర్వాత వీరి కాంబోలో రానున్న నాల్గవ సినిమా ఇది.

మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ పార్ట్ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. మొదటి భాగానికి మించి ‘పుష్ప: ది రూల్’ మూవీ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో సంజయ్ లీలా భన్సాలీతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తారేమో చూడాలి.