రాజమౌళి కి కౌంటర్ ఇచ్చిన అనీల్ రావిపూడి!?

చిన్న పెద్ద అనే తేడా లేకుండా సౌత్ ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రతి చిన్న సినిమాను కూడా ఈ మధ్య కాలంలో సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం అంటూ ప్రకటిస్తున్నారు. ఫలితం ఎలా వస్తుంది అనేది పట్టించుకోకుండా విడుదలకు ముందు మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు.

ఇలా చిన్నా చితకా సినిమాలు ఎన్నో ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రం పరవాలేదనిపించాయి.. కొన్ని సినిమాలు మాత్రం ఇతర భాషల్లో కనీసం కనిపించను కూడా కనిపించలేదు. పలువురు దర్శకులు పాన్ ఇండియా సినిమా లకు కథలను రెడీ చేసుకుంటున్నారు. ఈ సమయంలో అనీల్ రావిపూడి మాత్రం పాన్ ఇండియా ఆసక్తి లేదంటూ వ్యాఖ్యలు చేశాడు.

అనిల్ రావిపూడి పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి లేదనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెళ్లడించాడు. ఆయన మాట్లాడుతూ నేనేమీ పాన్ ఇండియా సినిమాలు చేయాలని కోరడం లేదు చేయడం లేదు. కానీ నేను చేసే ప్రతి సినిమా కూడా పైసా వసూల్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకోసం నా స్క్రిప్ట్ లను రెడీ చేసుకుంటున్నాను అన్నాడు. అంతే కాకుండా ప్రతి సినిమాను ఎక్కువ రోజులు చేయడం ద్వారా నాకు బోర్ వస్తుంది.

అందుకే ప్రతి సినిమాను కూడా తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తాను. నా ప్రతి సినిమాను నాలుగైదు నెలల్లోనే పూర్తి చేసేలా మొదటనే ప్లాన్ చేసుకుంటాను అన్నాడు. అనీల్ రావిపూడి వ్యాఖ్యలు చూస్తుంటే పాన్ ఇండియా సినిమాలు చేయాలని ప్రాకులాడుతు సంవత్సరాలకు సంవత్సరాలు తీసుకుంటున్న దర్శకులకు కౌంటర్ గా అనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఇది రాజమౌళికి కౌంటర్ అంటూ కొందరు గుసగుసలాడుతున్నారు. రాజమౌళి వరుసగా భారీ బడ్జెట్ తో ఎక్కువ కాలం సినిమాలు తీస్తూ పాన్ ఇండియా సినిమాలంటూ మూడు నాలుగు సంవత్సరాలకు ఒక్కటి చొప్పున సినిమాను విడుదల చేస్తున్నాడు. అందుకే అనీల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనేది కొందరి అభిప్రాయం.

తన ప్రతి సినిమా తక్కువ టైమ్ లోనే పూర్తి చేయాలనుకున్న అనీల్ కి ఎఫ్ 3 సినిమా విషయంలో మాత్రం ఆయన అంచనాలు తారుమారయ్యాయి. కరోనా కారణంగా ఏకంగా రెండు సంవత్సరాలుగా ఆ సినిమా షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి అయిన ఎఫ్ 3 సినిమా ను ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు ప్లాప్ అనేది అనిల్ రావిపూడికి తెలియదు. కనుక ఎఫ్ 3 కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుని.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్.. వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కూడా అదే తరహా విజయాన్ని ఎఫ్ 3 సొంతం చేసుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే ఆయన తదుపరి సినిమా గురించిన చర్చ మొదలైంది. ఆయన తదుపరి సినిమా నందమూరి బాలకృష్ణ హీరోగా చేయబోతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తో గతంలోనే అనిల్ రావిపూడి సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మొదలవ్వలేదు. ఎట్టకేలకు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఓకే అయ్యింది.

అఖండ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమా ఈ సమ్మర్ చివరికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా ను బాలయ్య మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య మరియు అనీల్ రావిపూడి కాంబో సినిమా ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.