‘సారా’జకీయం: జగన్, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకమా.?

రాష్ట్రంలో ‘లిక్కర్’ చుట్టూ రాజకీయం నడుస్తోంది. అంతకు మించిన అంశాలు చాలానే వున్నా, అత్యంత వ్యూహాత్మకంగా బడ్జెట్ సమావేశాలు పక్కదారి పట్టాయి. ప్రజా సమస్యలేవీ చర్చకు రావడంలేదు. కేవలం లిక్కర్ చుట్టూనే రచ్చ నడుస్తోంది. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో హాజరు కాకపోవడం, అవసరం వున్నా లేకపోయినా చంద్రబాబు పేరుని ప్రస్తావిస్తూ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్లేస్తుండడం.. ఇదంతా నాటకీయంగా కనిపిస్తోంది.

జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కాటుకి 25 మంది బలైపోయిన మాట వాస్తవం. బాధిత కుటుంబాలే ఈ విషయాన్ని కుండబద్దలుగొట్టేస్తున్నాయి. విపక్షాలు ఇలాంటి సందర్భాల్లో బాధితుల తరఫున నిలబడతాయి, నిలబడ్డాయి కూడా. అధికార పక్షం కూడా, బాధిత కుటుంబాల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేయడం అనేది ఆనవాయితీ. అయితే, అసలు కల్తీ మద్యం మరణాలే లేవంటూ ముఖ్యమంత్రి సభలో ప్రకటించేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రాష్ట్రంలో కల్తీ మద్యం అసలు లేనే లేదని ముఖ్యమంత్రి చెప్పదలచుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఎందుకంటే, ఎక్సైజ్ శాఖ ఎప్పటికప్పుడు కల్తీ మద్యాన్ని పట్టుకుంటూనే వుంది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా చట్ట సభల సాక్షిగా రచ్చ జరుగుతోంది.

సందట్లో సడేమియా, మంత్రులు తమ పదవులు నిలబెట్టుకునేందుకు ప్రతిపక్షంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వాటిని విని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాయిగా నవ్వుకోవడం (అలాగని టీడీపీ ఆరోపిస్తోంది) అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

అసలేం జరుగుతోంది రాష్ట్రంలో.? అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. రెండూ కలిసి రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నాయి. చంద్రబాబు హయాంలోనే చెత్త మద్యం బ్రాండ్లు వచ్చాయన్నది ముఖ్యమంత్రి ఆరోపణ. ప్రజా వేదికను కూల్చేసినప్పుడు చంద్రబాబు హయాంలో అనుమతులొచ్చిన చెత్త మద్యం బ్రాండ్లను వైఎస్ జగన్ ఎందుకు కొనసాగిస్తున్నట్లు.?

ఇక్కడే అర్థం కావడంలేదా.. ఇది 60-40 ఒప్పందాల ఫలితమని.? టీడీపీ – వైసీపీ మధ్య అవగాహన ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతోంది. జనమే వెర్రి వెంగళప్పల్లా ఈ రెండు పార్టీలకూ కనిపిస్తున్నట్టున్నారు.