చిరు కుమార్తె ప్రయత్నం `శ్రీదేవి శోభన్ బాబు`

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా అనేక చిత్రాలకు పని చేశారు. ఇప్పుడు నిర్మాతగానూ లక్ చెక్ చేసుకోబోతున్నారు. ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి నిర్మించిన `శ్రీదేవి శోభన్ బాబు` ప్రొడక్షన్ వెంచర్ టీజర్ ను స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈరోజు ఆవిష్కరించారు. టీజర్ లో సంతోష్ శోభన్ – గౌరీ జి కిషన్ మధ్య సన్నివేశాలు ఆద్యంతం అలరించాయి. ఆ ఇద్దరి స్వభావాలు.. కుటుంబాల నడుమ పర్యవసానం ప్రతిదీ ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కానీ విధి వారిని కలిపే ప్రయత్నం చేస్తే ఏమైంది? అన్నదే సినిమా.

ప్రశాంత్ కుమార్ దిమ్మల రచన- దర్శకత్వం వహించిన `శ్రీదేవి శోభన్ బాబు`ను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ తో కలిసి సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శరణ్య పోట్ల ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందిస్తుండగా.. సిద్దార్థ రామస్వామి సినిమాటోగ్రఫీ అందించారు. శశిదర్ రెడ్డి ఎడిటింగ్ అందిస్తున్నారు.

సుస్మిత కొణిదెల నిర్మాణంలో తొలి ప్రయత్నంపై పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తను ఇంతకుముందు సైరా లాంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి అలాగే మెగాస్టార్ ఇతర సినిమాలకు పని చేసి అనుభవం ఘడించారు. నిర్మాతగానూ సక్సెసవ్వాలని ఆకాంక్షిద్దాం.