తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కాంగ్రెస్ కు నష్టమని తెలిసీ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల మేలు కోరారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. ‘ఏ కలలను నెరవేర్చుకోవాలని రాష్ట్రం సాధించుకున్నారో వాటిని ఈ ప్రభుత్వం నెరవేర్చిందా..? కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే మేలు జరిగింది. ఈరోజు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పరిస్థితికి ఎవరు కారణం..?’
‘రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజలు, రైతులు, కార్మిక ప్రభుత్వం వస్తుందని భావించినా.. ఆ కల నేరవేరలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం పరిపాలన చేయకపోవడమే ఇందుకు కారణం. మోసపూరిత పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కట్టదు. టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే కలిసి పని చేస్తున్నాయి. మోదీ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే టీఆర్ఎస్ సహకరించింది. బీజేపీకి ఒంటరిగా గెలవలేమని తెలుసు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను ఓడిస్తాం’ అని అన్నారు. ఈసందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్ పరామర్శించారు.