సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మే 12న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ఇటీవల వచ్చిన SVP ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సర్కారు వారి సందడి కనిపిస్తోంది. మహేష్ బాబు చాలా కాలం తర్వాత చేస్తున్న కమర్షియల్ సినిమా కావడం.. ట్రైలర్ లో మాస్ స్వాగ్ తో ఆకట్టుకోవడంతో రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి ‘మా మా మహేషా’ అనే మాస్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. అంతేకాదు గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. అయితే దీనికి ముఖ్య అతిథిలుగా ఎవరు హాజరవుతారనేది మేకర్స్ వెల్లడించలేదు.
SVP గ్రాండ్ పార్టీకి ఎవరు గెస్టులుగా రాబోతున్నారో ఊహించగలరా అని ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ట్వీట్లు పెడుతున్నారు. సాధారణంగా హీరో మరియు మేకర్స్ తో సన్నిహితంగా ఉండేవారు.. తదుపరి సినిమా చేసేవారు అతిథులుగా వస్తుంటారు. సర్కారు వారి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండడంతో.. అదే బ్యానర్ లో సినిమా చేయనున్న పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అలానే మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా చేయనున్న లెజండరీ డైరెక్టర్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వస్తారని అంటున్నారు. ఇతర ముఖ్య అతిథి వచ్చినా రాకపోయినా ‘బాహుబలి’ డైరెక్టర్ ఖచ్చితంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు వస్తారని అంటున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతీ పెద్ద సినిమా ఫంక్షన్లలో జక్కన్న అతిథిగా కనిపిస్తున్నారు.
ఇకపోతే SVP ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తమిళ హీరో విజయ్ గెస్టుగా వస్తారని ఓ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబుతో సన్నిహిత సంబంధాలు కలిగివున్న దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇప్పుడు విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కోసం ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో హైదరాబాద్ లోనే ఉన్నారు. అందులోనూ మహేష్ – విజయ్ లకు ఒకరిపట్ల మరొకరికి గౌరవాభిమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అంతేకాదు మహేష్ తో క్లోజ్ ఫ్రెండ్ షిప్ కొనసాగించే ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ ఈ ఈవెంట్ కు వచ్చినా బాగుంటుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. మహేష్ తో ‘పోకిరి’ ‘బిజినెస్ మ్యాన్’ వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా సర్కారు వారి వేడుకలో భాగం అవుతారని అంటున్నారు. ఇది పూరీ శిష్యుడు పరశురామ్ డైరెక్ట్ చేసిన సినిమా అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే గత కొంతకాలంగా మహేష్ – పూరీ మధ్య అంతా బాగా లేదనే రూమర్స్ ఉన్నాయి. ఒకవేళ వీరిద్దరూ ఒక స్టేజీని పంచుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఏదైతేనేం మహేష్ బాబు కాకుండా అదే స్థాయి ఉన్న ఇతర స్టార్ హీరో మరియు స్టార్ డైరెక్టర్ ఎవరైనా ఈవెంట్ ను గ్రేస్ చేస్తే అది ఖచ్చితంగా ఎపిక్ అవుతుందని చెప్పాలి. మరి ఈరోజు సాయంత్రం జరగబోయే కార్యక్రమానికి ఎవరు చీఫ్ గెస్టులుగా వస్తారో చూడాలి.