వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పదే పదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి దత్త పుత్రుడంటూ విమర్శిస్తోన్న విషయం విదితమే. అసలంటూ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండానే, ‘చంద్రబాబునాయుడుగారి దత్త పుత్రుడు..’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా పరిగణించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కౌంటర్ ఎటాక్‌లో భాగంగా, ‘సీబీఐ దత్త పుత్రుడు.. చంచల్గూడా జైలు షటిల్ బ్యాచ్’ అంటూ విరుచుకుపడుతున్నారు.
సరే, ఆ విమర్శల సంగతి కాస్సేపు పక్కన పెడితే, ‘నెంబర్ వన్ లంచగొండి వైఎస్ జగన్..’ అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. అందుక్కారణం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వైఎస్ జగన్ మీద చేసిన వ్యాఖ్యలే.
అవినీతిని నిరోధించడానికంటూ ఓ యాప్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ‘నాకైతే ముందుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదనే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సెటైర్ వేయడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
‘అక్రమాస్తుల కేసులు మీదేసుకుని, జైలుకు వెళ్ళొచ్చినోళ్ళు మీరు, మమ్మల్ని ప్రశ్నించడమేంటి.? మా మీద సెటైర్లు వేయడమేంటి.?’ అంటూ ఈ మధ్యనే జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా వ్యాఖ్యానించారు. వాటికి కొనసాగింపుగా, ఇప్పుడీ ‘అవినీతి, లంచగొండి..’ ఆరోపణలు పవన్ నోట తెరపైకొచ్చినట్లుగా కనిపిస్తోంది.
అధికార పీఠం ఎవరు ఎక్కుతున్నారన్నదానిపై ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే, ఎవర్నయినా అధికార పీఠమెక్కించేది ప్రజలే. డబ్బులకి అమ్ముడుపోయి ఓట్లేశాక, ధరలు పెరిగాయ్.. పన్నుల మోత.. అంటే కుదరదు కదా.! ఇదీ జనసైనికులు, జనంలో పెంచుతోన్న అవగాహన తీరు.
‘ముఖ్యమంత్రి లంచగొండిగా వుంటూ.. యాప్స్ ద్వారా లంచాల్ని అరికడతామంటే ఎలా.?’ అన్న కోణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్న కూడా జనాన్ని ఆలోచింపజేస్తోందిప్పుడు.