ఫ్యాన్స్ బాధ కాస్త అర్థం చేసుకో డార్లింగ్..!


సినీ హీరోలను తమ అభిమానులు ఎంతగా ఆరాదిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా వారిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు.. డెమి గాడ్స్ గా కొలిచే డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వారికి భారీ కటౌట్లు కట్టి క్షీరాభిషేకాలు చేయడమే కాదు.. రక్త తిలకాలు దిద్దుతుంటారు. బర్త్ డేలు వస్తే ఒక పండుగలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తుంటారు. కేకులు కట్ చేస్తారు.. అన్నదాన రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

అయితే అభిమానులు ఎంత గుండెలు బాదుకున్నా.. గుండీలు తెంపుకున్నా.. తమ ఫేవరేట్ హీరోలను నేరుగా కలిసే భాగ్యం ఏ కొందరికో దక్కుతుంది. ఫ్యాన్స్ పై ఎంత ప్రేమ ఉన్నా.. కలవాలనే ఆరాటం ఉన్నా.. హీరోలకు అందుకు తగిన సమయం.. అలాంటి పరిస్థితులు దొరకవు. అందుకే కొందరు హీరోలు కేవలం తమ వీరాభిమానుల కోసమే ఫ్యాన్స్ మీట్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఫోటోలు దిగి కాసేపు వారితో సమయం గడుపుతుంటారు.

టాలీవుడ్ లో చాలామంది హీరోలు తమ అభిమానుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా వారితో కలవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఈ విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పడం లేదు. ‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన డార్లింగ్.. అభిమానులకు అందుబాటులో ఉండటం లేదనే కామెంట్స్ ఉన్నాయి.

సినిమా ఫంక్షన్స్ లో తప్ప ప్రభాస్ పెద్దగా ఫ్యాన్స్ తో కలిసిన సందర్భాలు లేవు. తమ అభిమాన హీరో వైఖరి పట్ల డార్లింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెలగక్కుతున్నారు. ఫ్యాన్స్ ను నిర్లక్ష్యం చేయొద్దని.. వారి కోసం కాస్త టైం కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు డై హార్డ్ ఫ్యాన్స్ నేరుగా ప్రభాస్ ఇంటికే చేరుకొని నిరాశ వ్యక్తం చేశారు..

యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ముగ్గురు కాలి నడకన హైదరాబాద్ లోని అతని ఇంటికి చేరుకుని ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఎన్నో ఇబ్బందులు పడి అన్నయ్య ఇంటికి చేరుకున్నాం. అయితే మనం ఎక్సపెక్ట్ చేసిందే ఇక్కడ జరిగింది. ‘సార్ ఊర్లో లేరు.. బిజీగా ఉన్నారు. పీఏ డ్యూటీకి సెలవు పెట్టారు’ అని చెబుతున్నారు” అని డార్లింగ్ ఫ్యాన్స్ తెలిపారు.

“మేం ఇప్పుడు ఏం ఇష్యూ చేయం. సార్ ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన్ని కలిసి ఫోటో దిగిన తర్వాతే ఇక్కడి నుంచి వెళతాం. ఏదేమైనా సరే అప్పటి వరకూ ఒక్కడే ఉంటాం” అని అభిమానులు వీడియోలో పేర్కొన్నారు. అయితే జూలై 15న ప్రభాస్ ఇంటికి వెళ్లి ఫ్యాన్స్ మీట్ గురించి మాట్లాడటానికి కొద్ది రోజుల క్రితం అభిమాన సంఘం ప్రెసిడెంట్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆలోపే కొందరు ప్రభాస్ ఇంటికి వెళ్లడం ప్రారంభించారు. మరి ఇప్పటికైనా అభిమానుల మొర ఆలకించి వారికి కాస్త సమయం ఇస్తారేమో చూడాలి.