విష్ణుబాబు సమాధానం చెబుతాడా? Will-Vishnu-Babu-answer


ఆ మధ్య జరిగిన మా ఎన్నికలు టాలీవుడ్ లో పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ మా అధ్యక్షపదవికి పోటీ చేశారు. ఇదే సమయంలో హీరో మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీకి దిగారు. దీంతో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి మద్దతు మాకుందంటే మాకుంది అంటూ ప్రకాష్ రాజ్ మంచు విష్ణు చెప్పుకున్నారు. ఫైనల్ గా స్థానికేతరుడు అనే కార్డ్ తో ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అయినా సరే ప్రకాష్ రాజ్ ఎక్కడా తగ్గనంటూ పోటీకి నిలిచారు. తన టీమ్ ని గెలిపించుకున్నారు. కానీ అధ్యక్షుడిగా మాత్రం ఓటమి పాలయ్యారు.

దీంతో మంచు విష్ణు మా ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా పీఠం ఎక్కారు. ఈ సందర్భంగా `మా` అసోసియేషన్ కు సొంత భవనం అనే నినాదం బయటికి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే తాను అధ్యక్షుడిగా విజయం సాధిస్తే సొంత ఖర్చులతో మా భవనాన్ని నిర్మిస్తానని మంచు విష్ణు మాటిచ్చారు. అంతే కాకుండా కార్ డ్రైవింగ్ చేస్తూ ఇప్పడే మా భవనం కోసం స్థలాన్ని చూశానంటూ ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

అయితే దాని గురించి ఇంత వరకు ఊసే లేదు. మంచు విష్ణు ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా ప్రమాణం చేసి పది నెలలు కావస్తోంది. అయినా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల మొక్కుబడిగా ఓ మీటింగ్ ని కండక్ట్ చేశాడు. దానికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతకు మించి ఏమీ చేయలేదన్నది కొంత మంది ఆర్టిస్ట్ ల వాదన. అయితే తాజాగా `మా భవనం` గురించి సహజ నటి జయసుధ ఘాటుగా స్పందించారు.

గతంలో మా అధ్యక్ష పదవికి పోటీపడి రాజేంద్ర ప్రసాద్ పై ఓడిపోయారు జయసుధ. ఆ తరువాత మరోసారి పోటీకి దిగకపోయినా మా లో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నటి జయసుధ ఇటీవల జరిగిన మా ఎన్నికలపై మా భవనంపై ఘాటుగా స్పందించారు. ఇటీవల జరిగిన మా ఎన్నికల గొడవలు తనకు అసహ్యాన్ని కలిగించాయన్నారు. అవి భరించలేకే తాను నెల రోజులు అదనంగా అమెరికాలో వుండాల్సి వచ్చిందని తెలిపారు. మా కుటుంబం అంటూనే విమర్శలు చేసుకోవడం తనకు నచ్చలేదన్నారు.

నటిగా 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న తాను నటిగా 75వ వసంతంలోకి అడుగుపెట్టాకైనా మా భవనం పూర్తవుతుందో లేదో తనకు అర్థం కావడం లేదంటూ సెటైర్ వేశారు. మా భవనం గురించి మురళీమోహన్ అధ్యక్షుడిగా వున్న సమయం నుంచి మాటలు చెబుతూనే ఉన్నారని నటీనటుల పారితోషికాల నుంచి ఒక్క శాతం ఇచ్చినా మా భవనం ఎప్పుడో పూర్తయ్యేదని మరి అది ఎందుకు జరగడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ కౌంటర్ కి `మా` అధ్యక్షుడు మంచు విష్ణుబాబు సమాధానం చెబుతారా? అని కామెంట్ లు పడుతున్నాయి. `మా` సొంత భవనం కోసం ఇప్పటికే స్థలాన్ని చూశానని సొంత ఖర్చులతో నిర్మిస్తానని వాగ్ధానాలు చేసి మంచు విష్ణు సహజ నటి జయసుధ ప్రశ్నలకు ఏమని సమాధానం చెబుతారో చూడాలని అంటున్నారు.