బాలీవుడ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో కుదేలవుతోంది. ఏ క్రేజీ స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేస్తోంది. భారీ డిజాస్టర్ అనిపించుకుంటోంది. ఇలా రిలీజ్ అయిన ప్రతీ సినిమా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో మేకర్స్ కోట్లల్లో నష్టపోతున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ కోసం రూ. 180 కోట్లు ఖర్చు చేశారు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించి తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకుంది.
దీంతో భారీ స్థాయిలో ఈ మూవీ ద్వారా నష్టాలని చవిచూడాల్సిన పరిస్థితి. ఇక ఇదే సినిమాతో అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’ కూడా విడుదలై ఇదే తరహాలో డిజాస్టర్ అనిపించుకుంది. ఈ మూవీకి 70 కోట్లు పెట్టారు. అయితే పెద్దగా బాక్సాఫీస్ వద్ద నష్టాలేవీ రాలేదు కానీ లాభాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆర్టీస్ట్ లకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ లు ఇవ్వడానికి బాలీవుడ్ నిర్మాతలు అంతగా ఆసక్తిని చూపించడం లేదు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో సమ్రాట్ పృథ్వీరాజ్ షంషేరా వంటి భారీ సినిమాలు కూడా దారుణంగా డిజాస్టర్ లుగా మారడం కోట్లల్లో నష్టాలని అందించడంతో ఆర్టిస్ట్ ల పారితోషికాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం రూ. 100 కోట్లు అనే రోజులు పోయాయి. ఇటీవల విడుదలైన సినిమాల పరిస్థితిని బట్టి బాలీవడ్ సినిమాల మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది. అక్కడ పరిస్థితి ఇలా వుంటే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ‘జవాన్’ కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతికి రూ. 21 కోట్లు పారితోషికం ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తొలిసారి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ పేరుతో ఓ భారీ మూవీని తెరకెక్కిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ వైఫ్ గౌరీ ఖాన్ ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా ప్రియమణి సాన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపికా పదుకోన్ కీలక అతిథి పాత్రలో మెరవబోతోంది.
ఇదిలా వుంటే ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా తమిళ నటుడు హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతి రూ. 21 క్రోట్లు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ వున్న పరిస్థితుల్లో ఈ రేంజ్ పారితోషికం ఇవ్వడం అన్నది కల్ల.
అంతే కాకుండా విజయ్ సేతుపతికి ఈ రేంజ్ పారితోషికం ఇస్తారన్నది కూడా నమ్మశక్యంగా లేదు. ‘ఉప్పెన’కు రూ. 5 కోట్లు తీసుకున్న విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమా కావడంతో రూ. 10 కోట్లు డిమాండ్ చేశారంటే ఓకే కానీ ఏకంగా రూ. 21 కోట్లు తీసుకుంటున్నారన్నది వట్టి రూమర్ మాత్రమేనని స్పష్టమవుతోంది.