రూ.1000 కోట్ల రెమ్యునరేషన్ పై సల్మాన్ స్పందన ఏంటంటే..?

ఇండియన్ టెలివిజన్ రంగంలో అత్యధిక టీఆర్పీతో సంచలనం సృష్టించిన హిందీ ‘బిగ్ బాస్’ రి

యాలిటీ షోకి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో.. ఇప్పుడు 16వ సీజన్ కోసం ముస్తాబవుతోంది.

సల్మాన్ ఖాన్ ఈసారి సీజన్ కు వ్యాఖ్యాతగా ఉండరని.. ‘బిగ్ బాస్’ నుంచి నిష్క్రమిస్తారని చాలా కాలంగా పుకార్లు ఉన్నప్పటికీ.. అతను మరోసారి హోస్ట్ గా చేయడానికి రెడీ అయ్యాడు. ఇందుకుగాను రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు రూమర్స్ వినిపించాయి.

ఈ నేపథ్యంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన సల్మాన్.. ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించినందుకు తాను వెయ్యి కోట్లు తీసుకున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు. తన పారితోషికం గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

”నేను అన్ని కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకొని ఉంటే ఇక లైఫ్ లో పని చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అది ఎప్పటికైనా నిజం కావాలని కోరుకుంటున్నా. అయితే అంత రెమ్యునరేషన్ తీసుకున్నా.. అది నా లాయర్ల ఫీజులు వంటి ఇతర అవసరాలకే సరిపోతుందేమో. నా లాయర్లు నాకంటే తక్కువేం కాదు(నవ్వుతూ). నా సంపాదన మీరు చెప్పే దాంట్లో నాలుగో వంతు కూడా ఉండదు. మీడియాలో వచ్చే ఈ వార్తలను ఇన్కమ్ ట్యాక్స్ – ఈడీ కూడా చదువుతుంది” అని సల్మాన్ ఖాన్ అన్నారు.

“చాలాసార్లు విసిగిపోయి ఇకపై ఈ షోని హోస్ట్ చేయలేనని నిర్వాహకులకు చెప్పాను. కానీ వాళ్లకు వేరే ఛాయిస్ లేక మళ్లీ నన్నే సంప్రదించారు. ఒకవేళ ఛాయిస్ ఉండుంటే నన్ను ఎప్పుడో మార్చేసేవాళ్ళు. నా స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు ఉన్నప్పటికీ.. ఎప్పటికీ ఆ పని చేయరు” అని సల్మాన్ నవ్వుతూ అన్నారు. బిగ్ బాస్ లో వచ్చే గొడవలు విమర్శలు తననెప్పుడూ ఇబ్బంది పెట్టలేదని.. ఎందుకంటే తనకు వేరే సమస్యలున్నాయని తెలిపాడు.

”బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కొన్నిసార్లు మితిమీరి వ్యవహరించినప్పుడు నేను మధ్యలో కలగజేసుకోక తప్పదు. పలు సందర్భాల్లో సహనాన్ని కోల్పోయాను. ప్రేక్షకులకు అసలేమైందో కొన్నిసార్లు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్లు ఫుల్ ఎపిసోడ్ ని చూడరు. కేవలం ఎడిట్ చేసిన వెర్షన్ ను మాత్రమే చూస్తారు” సల్మాన్ చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ తో టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో సల్లూ భాయ్ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. ఇందులో భాగంగా ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ లో చిరు తో కలిసి స్టెప్పులు వేశారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు హిందీ మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.

ఇకపోతే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ అనే హిందీ సినిమాలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ‘కాటమరాయుడు’ చిత్రానికి రీమేక్ అని టాక్. ఇక సల్మాన్ ‘టైగర్ 3’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.