జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు సామ్..!

దక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సామ్.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది.

మైయోసిటిస్ అనేది ప్రాథమికంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గించి.. కండరాలను బలహీన పరుస్తుంది. కండరాల్లో విపరీతమైన నొప్పి రావడం.. త్వరగా నీరసించిపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణంగా తెలుస్తోంది.

ఈ వ్యాధితో బాధపడేవారికి కూర్చున్న స్థానం నుండి లేచి నిలబడటం కూడా కష్టంగా ఉంటుంది. ఎక్కువ సేపు నడవలేరు.. నిల్చోలేరు. అలానే ఒకే పొజిషన్ లో నిద్ర కూడా పోలేరు. సకాలంలో సరైన చికిత్స అందించకపోతే ఈ రుగ్మత శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

మైయోసిటిస్ వ్యాధికి ఖచ్చితమైన రోగ నిర్ధారణ లేకపోయినా.. చికిత్స ద్వారా కోలుకునే అవకాశం ఉంది. ఇది సోకినవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ.. ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.

సమంత ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. తన సినిమాకు సంబంధించిన పనులు నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలో సామ్ చేతికి సెలైన్ ఎక్కుతుండగా.. మరొకవైపు సినిమాకు డబ్బింగ్ చెప్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక్కడ సమంత ధైర్యాన్ని మరియు ప్రొఫెషనలిజాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే దీని ఆమె వల్ల మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఏదైనా రంగంలో అగ్రస్థానంలో రాణిస్తున్నప్పుడు ఎవరికైనా ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం అవుతుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతూ వచ్చింది. ఈ క్రమంలో శారీరికంగా ఎక్కువ ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందులోనూ సామ్ తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న విషయాలతో గత ఏడాదిగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైన సమంత.. ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించడం వల్ల మరింత ప్రెజర్ తీసుకోవాల్సి ఉంటుందని ఫ్యాన్స్ కలవతపడుతున్నారు.

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 11న థియేటర్లలోకి రాబోతోన్న ఈ థ్రిల్లర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అగ్ర నటి తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం.

‘యశోద’ సినిమా సమంత స్టార్ డమ్ తోనే మార్కెట్ చేయబడింది. ఇప్పుడు ఆమె పేరే జనాలను థియేటర్ల వరకూ నడిపించాల్సి ఉంటుంది. అందులోనూ ఇది ఆమెకు ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్. ఈ అంశాలన్నీ ఆమెను పూర్తిగా ఒత్తిడికి గురి చేస్తాయేమో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

అందుకే సమంత ఇప్పుడు అన్ని విషయాలు పక్కన పెట్టి.. పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆరోగ్యం – జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదని.. అవి బాగుంటే సినిమాలు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

సినిమాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. సామ్ వీలైనంత వరకూ కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. లైఫ్ లో ఎన్నో సమస్యలకు ఎదురొడ్డి నిలిచిన సమంత.. ఈసారి కూడా అధిగమించాలని ధైర్యం చెబుతున్నారు.