ఆ దృశ్యాలు కలలోకి వచ్చేవి ట్యాబ్లెట్స్ వాడేదన్ని : జాన్వీకపూర్

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు గాను ఈ అమ్మడు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన చిత్రం ‘మిలీ’.

మలయాళ సూపర్ హిట్ చిత్రం హెలెన్ కి రీమేక్ అయిన మిలీ సినిమాను ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వీ కపూర్ మీడియా ముందుకు వచ్చింది. సినిమా కోసం చాలా కష్టపడ్డానంటూ మిలీ విశేషాలను జాన్వీ కపూర్ వెళ్లడించింది.

జాన్వీ మాట్లాడుతూ.. సినిమా కోసం దర్శకుడు అడిగాడని 7.5 కేజీల బరువు పెరిగాను. సినిమా కోసం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా కష్టపడ్డాను. సినిమాలో కథానుసారం మిలీ నౌదియార్ ఒక ఫ్రీజర్ లో చిక్కుకుంటుంది. ఆ సన్నివేశాల కోసం అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను.

చాలా రోజుల పాటు నేను మరియు దర్శకుడు ఇద్దరం కూడా చాలా కష్టపడ్డాం. ఆ సన్నివేశం కు సంబంధించిన దృశ్యాలు రాత్రి కలలోకి కూడా వచ్చేవి. అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అంతే కాకుండా పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ ను కూడా తాను ఆ సన్నివేశం చేసిన సమయంలో తీసుకోవాల్సి వచ్చిందని జాన్వీ పేర్కొంది.

ఒక రోజులో 15 గంటల పాటు ఫ్రీజర్ లో గడపాల్సి వస్తే.. ఆ సమయంలో ఒక ఎలుక వచ్చి కుట్టేస్తూ ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఊహించుకోడం కూడా చాలా కష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని జాన్వీ కపూర్ పేర్కొంది.