స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పుట్టిన రోజు నేడు. 1981 నవంబర్ 7 మంగుళూరులో అనుష్క జన్మించింది. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. నేడు 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్న అనుష్క శెట్టికి సినీ ప్రముఖులు.. అభిమానులు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో అనుష్క పేరు ఇండియా వైడ్ గా ట్రెండింగ్ అవుతుంది.
యోగాను కెరీర్ గా ఎంచుకున్న స్వీటీ శెట్టి అనుహ్యంగా సినిమా రంగంలోకి ఎంటరైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్’ మూవీలో హీరోయిన్ ఆఫర్ దక్కించుకుంది. ‘సాషా’ పాత్రలో మెరిసిన అనుష్క శెట్టి గ్లామర్ పరంగా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. స్విటీ శెట్టికి అనుష్క అని పేరు పెట్టింది కూడా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథే కావడం విశేషం.
అనుష్క శెట్టి సినిమా రంగంలోకి వచ్చి అప్పుడే 17 ఏళ్లు గడిచిపోయాయి. హీరోయిన్ కెరీర్ పరంగా ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ రోల్స్ చేసిన అనుష్క ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారింది. అనుష్క కెరీర్ ను ‘అరుంధతి’ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీలో అరుంధతిగా.. జేజమ్మగా అద్భుతమైన నటనను కనబర్చింది.
అయితే అనుష్కపై అన్ని కోట్ల బడ్జెట్ అవసరమా? అది చాలా రిస్క్ అని చాలామంది నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన అనుష్కపై నమ్మకంతో ఈ మూవీని భారీ బడ్జెట్లో నిర్మించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో నటనకు గాను అనుష్క శెట్టికి ఫిలిం ఫేర్ తెలుగు ఉత్తమ నటి అవార్డుతోపాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. ఈ మూవీ హిట్టుతో అనుష్క ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
అనుష్క కెరీర్లో ‘వేదం’..’రుద్రమదేవి’.. ‘పంచాక్షరి’.. ‘భాగమతి’.. ‘నిశబ్దం’ వంటి లేడి ఓరియేంటెడ్ సినిమాలు ఉన్నాయి. అలాగే ‘విక్రమార్కుడు’.. ‘లక్ష్యం’.. ‘బిల్లా’.. ‘యుముడు’.. ‘సింగం’..’మిర్చి’.. ‘సింగం-3’.. ‘బాహుబలి’ వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. స్టార్ హీరోలతో సమానంగా అనుష్క పాత్ర ఉండేలా డైరెక్టర్లు స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటారంటే ఎంతలా తన స్టార్డమ్ పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
తరుచూ పెళ్లి వార్తలతో అనుష్క శెట్టి వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పలుసార్లు మీడియా ముఖంగా ఆ వార్తలను ఖండించింది. తాను రిలేషన్ షిప్.. పెళ్లికి వ్యతిరేకం కాదని అనుష్క శెట్టి స్పష్టం చేసింది. తాను ప్రేమలో పడితే దాచుకోకుండా చెప్పేస్తానని తెలిపింది. తనకు ఈ హీరోతో నటించాలనే నిబంధన ఏమి లేదని.. కథ నచ్చితే ఏ సినిమాలోనైనా చేస్తానని చెప్పింది.
ఇక తనకు కాబోయే వాడిలో నిజాయితీ ఒక్కటే చూస్తానని అది ఉంటే చాలని అనుష్క శెట్టి ఒక సందర్భంలో చెప్పింది. ‘నిశబ్ధం’ మూవీ తర్వాత అనుష్క నుంచి ఇప్పటి ఒక్క సినిమా కూడా రాలేదు. నవీన్ శెట్టితో ఓ సినిమా చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఎనీ వే నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న స్వీటీకి ‘తుపాకీ టీం’ తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.