లోకనాయకుడు కమల్ హాసన్ అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నవంబర్ 24న కమల్ చిన్న పాటి నలతతో అలసటతో ఉన్నారు. తర్వాత జ్వరంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. కమల్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ (SRMC)లో చేరారు. అతను రెగ్యులర్ చెకప్ కోసం కూడా ఈ ఆసుపత్రిలో చేరాడు. కమల్ ఇటీవల హైదరాబాద్ నుండి తిరిగి చెన్నైకి వెళ్లారు.
ప్రస్తుతం జ్వరానికి చికిత్స పొందిన తర్వాత కమల్ హాసన్ ఆసుపత్రిలో రెగ్యులర్ చెకప్ లు చేయించుకోనున్నారు. ఎస్.ఆర్.ఎం.సి వైద్యులు రెండు రోజులు విశ్రాంతి తీసుకుని కోలుకోవాలని సూచించినట్లు సమాచారం. కమల్ త్వరలో డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నారు.
అయితే ఇటీవల విశ్వనటుడు హైదరాబాద్ లో తన గురువు గారైన లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ ను సందర్శించారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కళాతపస్వి కె విశ్వనాథ్ చేయి పట్టుకుని నమస్కరిస్తున్న ఫోటోను కమల్ షేర్ చేసారు. ఇది షేర్ చేస్తూ.. “మాస్టర్ కె. విశ్వనాథ్ సర్ ని వారి ఇంట్లో కలిశాను.
చాలా నోస్టాల్జియా.. గౌరవం“ అన్న వ్యాఖ్యను జోడించారు. కమల్ హాసన్ -కె విశ్వనాథ్ నడుమ అనుబంధం దశాబ్ధాలుగా కొనసాగుతోంది. సాగర సంగమం- స్వాతి ముత్యం- శుభ సంకల్పం వంటి అద్భుత కళాత్మక చిత్రాల కోసం ఆ ఇద్దరూ కలిసి పనిచేశారు.
ఇతర కెరీర్ మ్యాటర్ కి వస్తే… కమల్ హాసన్ ఇటీవల బ్లాక్ బస్టర్ విక్రమ్ లో చివరిగా కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం పాపులర్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ్ 6ని హోస్టింగ్ చేస్తున్నాడు. తదుపరి శంకర్ `భారతీయుడు 2` షూటింగ్ లోను పాల్గొంటున్నాడు. అంతేకాకుండా KH 234 కోసం మణిరత్నంతో తిరిగి కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. వీరిద్దరూ గతంలో `నాయకన్` కోసం కలిసి పనిచేశారు.