టాలీవుడ్ లో వారసులదే హవా అని చెప్పక తప్పదు. స్టార్ హీరోల వార సత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లో స్టార్ లు రాణిస్తున్న వారూ వున్నారు. స్టార్ డమ్ కోసం ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్న వాళ్లూ వున్నారు. ఇక ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారసులు కూడా స్టార్ డమ్ కోసం స్ట్రగుల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు వారుసులు మాత్రం కెరీర్ పరంగా చాలా ఇబ్బందికరమైన ఫేజ్ ని ఎదుర్కొంటున్నారు. వారే అక్కినేని అఖిల్ బెల్లంకొండ శ్రీనివాస్.
కింగ్ నాగార్జున నట వారసుడిగా తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్ మూడు సినిమాలతో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాడు. తొలి మూవీ ‘అఖిల్’తో భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకుని షాకిచ్చాడు. ఆ తరువాత చేసిన ‘హల్లో’ మిస్టర్ మజ్ను’ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ఫైనల్ గా అఖిల్ కి హిట్టు వస్తుందా? అని అంతా అనుమానంగా చూస్తున్న వేళ నాలుగవ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో హిట్ ని దక్కించుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ మూవీ అఖిల్ కెరీర్ కు కొంత వరకు బూస్ట్ ని అందించింది.
ఇంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో స్టార్ డమ్ ని దక్కించుకోవాలనే పరుగులో అఖిల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ మూవీ అఖిల్ కు తలనొప్పిగా తయారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ లు మార్చడం.. చాలా వరకు రీ షూట్ లు చేయడం.. వంటి కారణాలతో ఈ మూవీ బడ్జెట్ అంచనాలని దాటేసిందని ఇప్పుడు ఇదే టీమ్ ని టెన్షన్ పెడుతోందని ఇన్ సైడ్ టాక్.
ఈ మూవీపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. స్పై థ్రిల్లర్ కావడంతో సరికొత్త మేకోవర్ కోసం కఠోరంగా శ్రమించాడు.. సిక్స్ ప్యాక్ చేశాడు.. ఇంత చేసినా ఈ మూవీ రిలీజ్ ఎప్పుడన్నది ఇప్పటికీ మేకర్స్ కి క్లారిటీ లేకపోవడం.. రీషూట్ ల కారణంగా బడ్జెట్ పెరిగిపోవడంతో ఈ ప్రాజెక్ట్ అఖిల్ కు ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తోంది. ఇప్పడు ఇదే తరహా ఇబ్బందిని బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఫేస్ చేస్తున్నాడు.
‘అల్లుడు అదుర్స్’ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టినా ఇంత వరకు పూర్తి కాకపోవడం.. ఇప్పటికీ షూటింగ్ దశలోనే వుండటం ఇబ్బందికరంగా మారిందట. ఎన్నో ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ దీని కోసం మరో సినిమాని కూడా కమిట్ కాకుండా దీని కోసమే డేట్స్ మొత్తం కేటాయించి వర్క్ చేస్తున్నా ఎంతకీ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోడం అతన్ని కలవరానికి గురిచేస్తోందట.
ఈ ఇద్దరు వారసుల సమస్య తీరేదెన్నడు.. వారి సినిమాలు బయటికి వచ్చేదన్నడనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ‘ఏజెంట్’ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామన్ని టీమ్ ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ ని ఇవ్వకపోవడం ‘ఛత్రపతి’ రీమేక్ పై బెల్లంకొండ శ్రీనివాస్ టీమ్ ఎలాంటి న్యూస్ చెప్పకపోవడంతో ఈ రెండు ప్రాజెక్ట్ లు ఇప్పట్లో బయటికి రావడం కష్టమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.