యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. పలు దేశాల మీడియాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రముఖంగా కథనాలు రాయడం మనం చూశాం. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు ఎన్టీఆర్ కు అభిమానులు అవుతున్నారు.
ఎన్టీఆర్ యొక్క నటనకు ఫిదా అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అన్నదానికి ఎక్కువగానే ఎన్టీఆర్ క్రేజ్ దక్కించుకున్నాడు. విదేశాల్లో కూడా అభిమానులను దక్కించుకున్న ఎన్టీఆర్ గురించి హీరోయిన్ పాయల్ ఘోస్ 2020 సంవత్సరంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు నిజం అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ కమ్ ఫ్లాప్ మూవీ ఊసరవేల్లి లో హీరోయిన్ గా తమన్నా నటించింది. అదే సినిమాలో తమన్నా స్నేహితురాలిగా సినిమా మొత్తం కనిపించే కీలక పాత్రలో పాయల్ ఘోస్ నటించిన విషయం తెల్సిందే.
ఊసరవేల్లి లో పాయల్ ఘోస్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో సన్నివేశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పై అప్పటి నుండే అభిమానం పెంచుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేక పోయిన ఈ అమ్మడు పలు సార్లు ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
2020 సంవత్సరంలో త్వరలోనే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు వస్తుందని పాయల్ ఘోస్ట్ పేర్కొంది. ఆ సమయంలో ఆమె వ్యాఖ్యలను కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పితే మీడియా పెద్దగా పట్టించుకోలేదు.
కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. తాజాగా ట్విట్టర్ ద్వారా పాయల్ ఘోస్ట్ స్పందిస్తూ.. తాను 2020 సంవత్సరంలోనే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడు అన్నాను. అన్నట్లుగానే ఆయన ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తో ఆస్కార్ ముందు ఉన్నారు. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు దక్కిందని పాయల్ ఘోస్ పేర్కొంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాయల్ ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు.