సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ జంట ఫిబ్రవరి 6న జైసల్మేర్ లో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4 నుంచి మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు వైభవంగా కొనసాగుతాయి. అయితే విక్ -క్యాట్ పెళ్లి తరహాలోనే ఈ జంట పెళ్లి వేదిక వద్దకు ఫోన్ లకు అనుమతి లేదు. ఆ మేరకు కొత్త పాలసీ ని ఖాయం చేసారు. అతిథులను ఇప్పటికే ఫోటోలు పోస్ట్ చేయవద్దని కోరారు. తాజా కథనాల ప్రకారం… ఈ జంట ఎటువంటి ఫోటోలు వీడియోలను పోస్ట్ చేయకూడదని హోటల్ లోని అతిథులు సిబ్బందిని కోరారు.
ఇప్పటికే పెళ్లి వేడుక కోసం విచ్చేసిన అతిథులతో హోటల్ కళకళలాడుతోంది. తమ అభ్యర్థనలను అతిథులు కచ్చితంగా పాటించాలని కోరారు. ఇంతకుముందు పెళ్లి సమయంలో విక్కీ- కత్రిన జంట ఇదే మాదిరిగానే అతిథులను అభ్యర్థించారు. దానినే సిధ్-కియరా అనుసరిస్తున్నారు.
ఈ పెళ్లి అతి కొద్ది మంది బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. కానీ ఇప్పుడు కరోనాతో సమస్య లేదు కాబట్టి ఎక్కువ మంది సెలబ్రిటీలు పెళ్లికి అటెండయ్యేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. సిధ్ – కియారా ఇరువురి తరపున సన్నిహితులైన దర్శకులు నిర్మాతలు ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులు సహా చాలామంది స్నేహితులను పెళ్లికి ఆహ్వానించారని తెలిసింది.
ఇప్పటివరకు ధృవీకరించిన పేర్లలో కరణ్ జోహార్ – అశ్విని యార్డి- నవ జంటకు చాలా సన్నిహితులు. వారితో పాటు వరుణ్ ధావన్- విక్కీ కౌశల్- కత్రినా కైఫ్- రకుల్ ప్రీత్- జాకీ భగ్నాని తదితరులు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారు.
ఈ జంట పెళ్లికి ముందు సంగీత్- మెహందీ -హల్దీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 4 – 5 తేదీలలో ఇవి జరుగుతాయి. ఫిబ్రవరి 6న రాజస్థాన్ జైసల్మేర్ లో ఈ జంట తమ పెళ్లి ప్రమాణం చేయనున్నారు. వివాహానంతరం సిద్ధార్థ్ -కియారా ఇరువురు తమ బంధుమిత్రుల కోసం రెండు భారీ రిసెప్షన్ లను నిర్వహించనున్నారు. వీటిలో ఒకటి ముంబైలోని వారి పరిశ్రమ స్నేహితుల కోసం .. మరొకటి ఢిల్లీలోని వరుడి కుటుంబీకుల కోసం భారీ వేడుక చేస్తారని తెలిసింది. కొత్త జంట అందమైన పెళ్లి ఫోటోలు వీడియోల రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.