చెల్లి సింగర్ శ్రీలేఖతో విభేదాలు.. రాజమౌళి క్లారిటీచెల్లి సింగర్ శ్రీలేఖతో విభేదాలు.. రాజమౌళి క్లారిటీ

దర్శకధీరుడు రాజమౌళి.. ఈ పేరు గురించి ప్రపంచ సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశం గర్వించదగ్గ సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ దర్శకులు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. అయితే ఆయనకు ఒక చెల్లి ఉందని ఆమె ప్రముఖ సింగర్ అని చాలా తక్కువ సినీ ప్రియులకు మాత్రమే తెలుసు. ఆమె పేరు శ్రీలేఖ. రాజమౌళికి ఆమెకు మధ్య ఎన్నో ఏళ్లుగా గొడవలు ఉన్నాయని చాలాకాలంగా ప్రచారంలో ఉంది.

అందుకే జక్కన్న ఆయన సినిమాల్లో చిన్న అవకాశం కూడా ఇవ్వరని టాక్ కూడా ఉండేది. తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన ఒక పనితో ఆ రూమర్స్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే.. ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ సినీ కెరీర్ లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ చేయబోతున్నారు. ఈ ఏడాది మార్చి 17 నుంచి ఈ పర్యటనను ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆమె సోదరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ”ప్రపంచంలోని 5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ. తాను సాధించిన ఘనతలకు అభిననందనలు తెలుపుతున్నాను” అని అన్నారు. ఆస్కార్ వేడుకకు వెళ్ళబోతున్న రాజమౌళి అన్న చేతుల మీదుగా నా వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి సీరియల్ శాంతినివాసంకి తానే మ్యూజిక్ అందించినట్లు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తన టూర్ పోస్టర్ జక్కన్న ద్వారా రిలీజ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

రవి మెలోడీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ద్వారా ఇన్వెస్టర్ గ్రోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ పర్యటన కొనసాగనుంది. మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలై లండన్ అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తదితర 25 దేశాలలో 25 మంది సింగర్స్ తో కలిసి ఈ మ్యూజిక్ టూర్ జరగనుంది.