వారిద్దరూ దర్శక దిగ్గజాలు.. ఒకరు భావుకత ఉన్నవారైతే మరొకరు తీక్షణత ఉన్నవారు.. ఇద్దరూ హిట్స్ కొట్టారు.. ఫ్లాప్స్ ఇచ్చారు.. కెరీర్ లో శిఖరాగ్రానికి చేరినవారు..కొంతకాలంగా మాత్రం వారి నుంచి ఆ స్థాయి సినిమాలు లేవు. సమకాలీకులు..జూనియర్లు దూసుకెళ్తుంటే వీరేమో.. అలా నిలకడగా ఉండిపోయారు. ఇలాంటి సమయంలో యాక్సిడెంటల్ గానో పోటాపోటీగానో అన్నట్లు ఇద్దరి నుంచి సినిమాలు కాస్త అటుఇటుగా సిద్ధమయ్యాయి. అంగ”రంగ వైభవం” తెలుగు సినిమాను మరో కోణంలోంచి చూపిన దర్శకుడు కృష్ణవంశీ. అందుకే ఆయనను క్రియేటివ్ డైరెక్టర్ అన్నారు.
భావుకుడైన కృష్ణవంశీ నుంచి వచ్చిన సిందూరంమురారి అంత:పురం ఎంతోమందిని కదిలించాయి. గులాబీతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపి.. నిన్నే పెళ్లాడుతా అంటూ గిలిగింతలు పెట్టి.. చందమామ వరకు తీసుకెళ్లిన మాయావి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్డం’ మరో లెవెల్. దేశభక్తి రంగరించి వదిలిన ఈ సినిమా పాటలు థియేటర్లను ఊపేశాయి.
అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో తీసిన రాఖీ.. ఎన్టీఆర్ లోని నటుడిని మనకు పరిచయం చేసింది. కథాబలం పిక్చరైజేషన్ తో ప్రేక్షకులను కట్టిపడేసే కృష్ణవంశీ.. కొన్నాళ్లుగా వెనుకబడ్డారు. ఆయన స్థాయి సినిమా రాలేదు. అందులోనూ సోషల్ మీడియా రాజ్యమేలుతున్న కాలంలో కృష్ణవంశీ వెనుకబడ్డారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ‘కృష్ణవంశీ ఈజ్ బ్యాక్’ అనేలా చేసింది ‘రంగమార్తాండ’. ప్రివ్యూ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చకున్న రంగమార్తాండకు థియేటర్లలోనూ జన స్పందన బాగుంది.
సినిమా లెంగ్త్ నిర్మాణ పరంగా లోపాలు వదిలేస్తే.. బ్రహ్మానందం ప్రకాశ్ రాజ్ రమ్య కృష్ణ తదితర నటీనటుల నటనసాంకేతిక నిపుణుల పనితనం కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభ దేంట్లోనూ వంకపెట్టలేని విధంగా ఉంది రంగమార్తాండ. రీమేక్ ల జోలికి పోని కృష్ణవంశీ రీమేక్ ను ఎంచుకుని తనదైన శైలిలో ఫామ్ లోకి వచ్చారని ప్రశంసిస్తున్నారు. మున్ముందు ఆయన నుంచి మంచి సినిమాలు చూడొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాలం కలిసొస్తే మళ్లీ నాటి ‘గుణ’ ఒక ఊహకు అద్భుత రూపు ఇవ్వగల దర్శకుల్లో గుణ శేఖర్ అనడంలో సందేహం లేదు.
చూడాలని ఉంది.. ”ఒక్కడు” ఒక్కటి చాలు అనుకున్న పాయింట్ ను గుణ శేఖర్ ఏ విధంగా చూపగలరో చెప్పేందుకు. ”సొగసుచూడ తరమా”ను ఎంత సొగసుగా చూపారో..”రుద్రమ దేవి”ని అంత పౌరుషంగా చూపారు. 30 ఏళ్ల సినీ కెరీర్ లో ఫ్లాపులే ఎక్కువగా ఉన్నా.. గుణ శేఖర్ ను మాత్రం తేలిగ్గా తీసిపారేయలేమని కచ్చితంగా చెప్పొచ్చు. 2015లో ఆయన నుంచి వచ్చిన రుద్రమ దేవి చరిత్రాత్మక సినిమాగా నిలిచిపోయింది. విమర్శకుల ప్రశంసలు పొందింది.
అప్పటినుంచి గుణశేఖర్ ప్రయత్నం అంతా ”శాంకుతలం” మీదనే ఉంది. ఏమవునో? ఏమో? రంగమార్తాండతో కృష్ణవంశీ గాడిన పడితే.. ”శాంకుతలం” గుణశేఖర్ కు పరీక్ష పెట్టనుంది. చిత్రమేమంటే ఈ రెండు సినిమాలు సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకొన్నాయి. కృష్ణవంశీ నాలుగేళ్ల కష్టం రంగమార్తాండ. మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఆయన చెక్కుచెదరలేదు. శాంకుతలం మొదలుపెడుతున్నట్లు 2020 అక్టోబరులో ప్రకటించారు గుణశేఖర్. సరిగ్గా రెండేళ్ల నుంచి చిత్రీకరణ సాగుతోంది. ఎట్టకేలకు వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
సమంత నిలబెడుతుందా?శాకుంతలం ప్రారంభానికి ముందు సమంత జీవితం వేరు. ఇప్పటి జీవితం వేరు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఆరోగ్య పరంగా సమస్యలతో సమంత కూడా రెండేళ్లుగా చాలా కష్టాలు చూశారు. అయితే ఆమె సినీ కెరీర్ మాత్రం ఈ రెండేళ్లలో మరింత సక్సెస్ అయింది. ఇలాంటి నేపథ్యంలో వస్తున్న శాకుంతలం సూపర్ హిట్ అయితే అటు సమంతకు ఇటు గుణశేఖర్ కు ఇద్దరికీ మేలే. సినీ పరిశ్రమకు మరింత మంచి.