ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయని తెలుస్తుంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి ఫోన్ లో టాలీవుడ్ జనాల ఫోన్ నెంబర్లు ఉన్నాయంటూ వస్తున్న కథనాల నేపథ్యంలో ఇది మరింత హీటెక్కింది. ఈ సమయంలో… తనకు కూడా డ్రగ్స్ ఆఫర్ చేశారంటూ హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును.. తనని డ్రగ్స్ తీసుకోమ్మని చాలాసార్లు ఆఫర్ చేశారని కానీ తాను తీసుకోలేదని హీరో నిఖిల్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్ దుర్వినియోగం – డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిర్వహించిన కార్యక్రమలో పాల్గొన్న సందర్భంగా నిఖిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రచారం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు ప్రియదర్శితో కలిసి హీరో నిఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన… డ్రగ్స్కి అందరూ దూరంగా ఉండాలని సూచించాడు. డ్రగ్స్ కు అలవాటు పడితే అదే డెత్ సెంటన్స్ అని హెచ్చరించాడు.
స్టూడెంట్స్కు అందమైన జీవితం ఉందని ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని కానీ డ్రగ్స్కి మాత్రం నో చెప్పండని సలహా ఇచ్చాడు. ఇదే సమయంలో పార్టీలకు వెళ్లండి ఎంజాయ్ చేయండి.. కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోకండి అని సూచించాడు.
ఇదే కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసిన నటుడు ప్రియదర్శిని రామ్ కూడా డ్రగ్స్ పై స్పందించారు. ఈ సందర్భంగా… 10 సంవత్సరాల క్రితం తాను సిగరెట్ తాగానని గుర్తు చేసుకున్న ప్రియదర్శి… కొంతకాలం తర్వాత తనలో పరివర్తన వచ్చి సిగరెట్ తాగడం మొత్తానికే మానేశానని చెప్పారు. ఇదే విధంగా డ్రగ్స్ వినియోగం పై అందరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉందని ప్రియదర్శి అభిప్రాయపడ్డాడు.