మోహ‌న్ బాబు లో క‌రుడ‌గ‌ట్టిన రౌడీని చూడ‌ని వ‌ర్మ‌!

నాగార్జున‌-రాంగోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన ‘శివ’ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు సినిమా చ‌రిత్ర‌ని రాయాల్సి వ‌స్తే శివ‌కి ముందు..త‌ర్వాత అని క‌చ్చితంగా పేర్కొంటారు విశ్లేష‌కులు. భార‌తీయ చిత్రాల్లోనే అదో ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ. అందులో ప్ర‌తీ పాత్ర లోనూ అద్భుత‌మైన క్రియేటివిటీ ఉంటుంది. అందుకే ఆ చిత్రాన్ని ప్రేక్ష‌కులంతా ఓ క‌ల్ట్ చిత్రంగా భావిస్తారు. అయితే ఇంత గొప్ప చిత్రంలో కలెక్ష‌న్ కింగ్
మోహ‌న్ బాబు ..వ‌ర్మ కార‌ణంగా ఛాన్స్ కోల్పోయారు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ సినిమా క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా ర‌ఘువ‌ర‌న్ ద‌గ్గ‌ర రౌడీగా ప‌నిచేసే గ‌ణేష్ పాత్రకు ఎవ‌రిని తీసుకోవాలా? అని చ‌ర్చిస్తుండ‌గా నిర్మాత అక్కినేని వెంక‌ట్ మెహ‌న్ బాబు పేరుని సూచించారుట‌. హీరోకి వార్నింగ్ ఇచ్చే స్థాయి ఉండాలంటే అంద‌రికీ తెలిసిన న‌టుడైతే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చారుట‌. మెహన్ బాబు అనుభ‌వాన్ని వ‌ర్మ‌కి చెప్పారుట‌. త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో మోహ‌న్ బాబుని ఓప్పిస్తాన‌ని వ‌ర్మ‌తో అన్నారుట‌.

అయితే అందుకు వ‌ర్మ ఒప్పుకోలేదుట‌. ఆపాత్ర‌లో మోహ‌న్ బాబుని పెట్టుకుంటే ఆ సీన్ ఎపెక్టివ్ గా రాద‌న్నారుట‌. అందుకు కార‌ణం కూడా వ‌ర్మ తెలిపారు. ‘తెలుగు ప్రేక్ష‌కుల‌కు మోహ‌న్ బాబు సుప‌రిచితులు. ఆయ‌న న‌ట‌న‌..డైలాగ్ డిక్ష‌న్ ప్ర‌త్యేకంగా ఉంటుంది.

అలాంటి వ్య‌క్తి శివ పాత్ర‌కు వార్నింగ్ ఇస్తుంటే ఆ పాత్ర‌లో ప్రేక్ష‌కుడికి మోహ‌న్ బాబు మాత్ర‌మే క‌నిపిస్తారు త‌ప్ప క‌రుడ‌గ‌ట్టిన విల‌న్ క‌నిపించ‌డు. అలా క‌నిపించాలంటే ఆ పాత్ర పోషించే వ్య‌క్తి కొత్త‌గా ఉండాల‌ని భావించాను. అందుకే ఆ పాత్ర‌కి విశ్వ‌నాద్ అనే న‌టుడ్ని తీసుకున్నాను. అత‌ను ఆ పాత్ర‌ని ఎంతో గొప్ప‌గా చేసాడు’ అని అన్నారు.

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కెరీర్ ఆరంభంలో ప్ర‌తి నాయ‌కుడు పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే. నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌ల్లోనూ త‌న‌దైన ముద్ర‌వేసారు. అయితే సీరియ‌స్ యాక్ష‌న్ పాత్ర‌ల్లో అత‌ని విల‌నిజం పెద్ద‌గా హైలైట్ అవ్వ‌లేదు. కానీ విల‌నిజంలో త‌న‌దైన మార్క్ ఆనాడే వేసారు. డిఫ‌రెంట్ డైలాగ్ డిక్ష‌న్ తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌ న‌టుడాయ‌న‌. అటుపై హీరోగా ట‌ర్న్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ నెగిటివ్ పాత్ర‌ల జోలికి వెళ్లింది లేదు.