మలయాళ నటి మమితా బైజు తమిళ దర్శకుడు బాల చేయి చేసుకున్నట్లు నిన్నటి రోజున మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘వానంగాన్’ సినిమా నుంచి హీరోయిన్ గా తనని తప్పించడానికి కారణం బాల అని.. ఆ సినిమా సెట్స్లో దర్శకుడు బాలా తనను తిట్టేవాడని.. సెట్స్లో చేయి కూడా చేసుకున్నాడని మీడియాలో కథనాలొచ్చాయి.
ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తప్పంతా బాలదే అని సోషల్ మీడియాలో కథనాలు అంతకంతకు వెడెక్కించాయి. ఈ నేపథ్యంలో నెటి జనులు బాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన ప్రవర్తనా తీరును ఉద్దేశించి మండిపడ్డారు. తాజాగా ఈ కథనాలపై మమిత బైజు స్పందించింది. బాలతో తనకు ఎలాంటి విబేధాలు లేవని..తనని బాల కొట్టలేదని అవన్నీ తప్పుడు కథనాలన్ని ఖండించింది.
‘నేను ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వార్తలు పూర్తిగా నిరాధార మైనవని. ఓ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ నుండి ఆ వ్యాఖ్యల్ని వక్రీకరించి తప్పుడు కథనాలు సృష్టించారు. దాన్ని హైలైట్ చేసారు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ – ప్రొడక్షన్‌తో సహా దాదాపు ఒక సంవత్సరం పాటు బాలా సర్‌తో కలిసి పనిచేశాను. నేను మంచి నటిగా మారడానికి అతనే కారణం.
ఆ చిత్రంలో నేను పని చేస్తున్న సమయంలో నేను ఎలాంటి మానసిక – శారీరక హానికి గాని గురికాలేదు. వృత్తిపరమైన కమిట్‌మెంట్‌ల కారణంగా నేను ఆ చిత్రం నుండి తప్పుకున్నాను. ఇలాంటి వార్తలు రాసే ముందు మీడియా వారు నన్ను సంప్రదిస్తే బాగుంటుంది. నా ద్వారా వాస్తవాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది’ అని అన్నారు. ఆమె క్లారిటీతో నెటి జనులు అయోమయంలో పడ్డారు.