మహానటి సావిత్రి వృత్తి-వ్యక్తిగత జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి వచ్చే వరకు మహానటి అనే పేరు మరే నటికి లేదేమో. ఆమె తర్వాత కూడా మరో మహానటి రాలేదని చెప్పవచ్చు. 20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప నటి జీవితంలో నటించే అరుదైన అవకాశం కీర్తి సురేష్ దక్కడం అన్నది ఆమె పూర్వజన్మసుకృతమనే చెప్పాలి. ఎంతో మంది నటీమణులున్నా నాగ్ అశ్విన్ ఆమెలో మహానటిని చూడంతోనే అది సాద్యమైంది.
ఇక ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా ఆ మహానటి జ్ఞాపకాలు మరోసారి నెమర వేసుకునే అవకాశం వచ్చింది. సావిత్రీ జీవితానికి సంబంధించిన విశేషాలు..ఫోటలతో ఓ ప్రత్యేక ‘కాఫీ టేబుల్ బుక్’ ని సావిత్రి కుమార్తె చాముండేశ్వరి విడుదల చేస్తున్నారు. విజయ చాముండేశ్వరి కి సైతం తెలియని ఎన్నో ఛాయా చిత్రాలను ఇందులో పొందు పరిచినట్లు తెలుస్తోంది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈరోజు సాయంత్రం లాంచ్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. చిరుతో పాటు ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్ కూడా భాగమయ్యే అవకాశాలున్నాయి. మహానటి బయోపిక్ లో ఆమె నటించింది కాబట్టి ఆ హోదాలో కీర్తి హాజరవుతుందని..ఆమెకి కూడా ప్రత్యేక ఆహ్వానం కుటుంబ సభ్యుల నుంచి వెళ్లే ఉంటుందని గెస్ చేస్తున్నారు. కీర్తి కూడా అటెండ్ అయితే ఆవేదిక మరింత శోభతో నిండిపోతుంది.
చిరు-కీర్తి ఒకే వేదికపై ఉంటే ఆ కార్యక్రమం ఎంత సరదాగా..సంతోషంగా జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఇద్దరు ‘భోళా శంకర్’ చిత్రంలో అన్నా-చెల్లిగా కలిసి నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సావిత్రి బయోపిక్ చూసి కీర్తి నటనపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆమె నటించిన తీరుపై చిరంజీవి ఎంతో సర్ ప్రైజ్ అయినట్లు చెప్పుకొచ్చారు. మళ్లీ ఆ జ్ఞాపకాలు నెమర వేసుకునే అవకాశం ఈరోజు దొరికింది. ఇంకా ఈ కార్యక్రమానికి పరిశ్రమకి సంబంధించిన పలువురు హాజరయ్యే అవకాశం ఉంది.