కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ను హీరోగా విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇటీవల పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే అది సినిమా కాదు.. మ్యూజిక్ ఆల్బమ్. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సాంగ్ ను ఇటీవల ఇనిమెల్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్ లో లోకేష్ సరసన కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటించింది.
అయితే శ్రుతి హాసన్ పక్కన లోకేష్ కనగరాజ్ బాగా సెట్ అయ్యారు. ఒక హీరోకి ఏ మాత్రం తగ్గకుండా ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సాంగ్ టేకింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. ఒక చిత్రాన్ని మొత్తం సాంగ్ లో చూపించేశారు మేకర్స్. ఆ సాంగ్ కు కమల్ హాసన్ లిరిక్స్ అందించగా.. శ్రుతి హాసన్ కంపోజ్ చేసింది. కాన్సెప్ట్ కూడా ఆమెనే అందించింది. శ్రుతి మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసింది.
ఇనిమెల్ పాట విన్న తర్వాత కమల్ హాసన్ పెన్నులో పదును అస్సలు తగ్గలేదని చాలా మంది కొనియాడారు. తాజాగా ఈ ఇనిమెల్ సాంగ్ జర్నీ వీడియోను కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కమల్, శ్రుతి ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. సాంగ్ షూటింగ్ తో పాటు కంపోజింగ్ తదితర విషయాలను చర్చించుకుంటున్నట్లు అర్థమవుతోంది. పాట రిలీజ్ అయిన ఒక నెల తర్వాత మ్యూజికల్ జర్నీ విడుదల చేయడం గమనార్హం.
ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే.. ఒక అబ్బాయి అమ్మాయి పరిచయమయ్యాక మొదటిసారి కలిసి బయటకు వెళ్తారు. ఎక్కడికి వెళ్లాలా అని తెగ ఆలోచిస్తూ చివరకు సినిమాకు వెళ్తారు. అక్కడ వారి భవిష్యత్ ను ఆ మూవీలో ఊహించుకుంటారు. ఇద్దరి మధ్య ప్రేమ బలపడడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, కాపురం పెట్టడం, అనుకోకుండా వైవాహిక జీవితంలో గొడవలు రావడం, వాళ్లు విడాకులకు అప్లై చేసి విడిపోవడం వరకు జరుగుతుంది. అదంతా స్క్రీన్ మీద చూసుకుని ఇద్దరూ ఆశ్చర్యపోతారు.
ఆ తర్వాత తాము కూడా ఇలాగే అవుతామా అని ఇద్దరూ ప్రశ్నించుకుంటారు. అయితే అలాంటిది ఏమీ జరగదని తమకు తాము నచ్చజెప్పుకుని ప్రేమను కొనసాగిస్తారు. అయితే ఈ సాంగ్ కు గాను భువన్ గౌడ సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. శ్రుతి మరోసారి మ్యూజిక్ కంపోజర్ గా తన సత్తా చాటింది. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గానే కాకుండా.. ఒక నటుడిగా కూడా తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకున్నారు. మరి ఈ సాంగ్ ను మీరు చూశారా?