బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏకంగా రూ.350 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లుగా సమాచారం అందుతోంది.
రూ.350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ సమయంలో కాస్త హడావుడి చేయగలిగింది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ప్రమోషన్స్ చేశారు. కానీ విడుదల తర్వాత వచ్చిన రివ్యూలు మరియు పబ్లిక్ టాక్ కారణంగా కనీసం రూ.60 కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోయింది.
ఈ మధ్య కాలంలో అతి పెద్ద డిజాస్టర్ గా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుతున్నారు. అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్న బడే మియాన్ చోటే మియాన్ కు ఓటీటీ లో అయినా కాస్త మంచి స్పందన వస్తుందని అంతా భావించారు. కానీ అక్కడ కూడా దారుణమైన డిజాస్టర్ తప్పలేదు.
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సాధారణంగా ఏ స్టార్ హీరో సినిమా విడుదల అయినా కూడా కనీసం వారం లేదా రెండు వారాల పాటు నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో నిలవడం జరుగుతుంది. కానీ ఈ సినిమా టాప్ 20 లో కూడా కనిపించడం లేదట.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తున్నాయి. కానీ ఈ సినిమా కి మాత్రం అత్యంత దారుణమైన టాక్ రావడంతో పాటు, ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ పడే విధంగా సన్నివేశాలు ఉండటంతో ఓటీటీ లో కూడా ఘోర పరాభవం ఎదురయ్యింది.