SSMB29 కథకు ఆధారం ఆ పుస్తకాలేనా జక్కన్నా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ క్రేజీ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఏ చిన్న రూమర్ బయటకు వచ్చినా, క్షణాల్లోనే వైరల్ చేసేస్తున్నారు. లేటెస్టుగా ఈ సినిమా కథా వస్తువు గురించిన ఫ్యాన్స్ ను మరింత ఎగ్జైట్ చేసే ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌ అడ్వెంచర్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు ఆయన తండ్రి, రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. జక్కన్న సైతం ‘ఇండియానా జోన్స్’ లాంటి హాలీవుడ్ మూవీ టెంప్లేట్‌ లో ఓ యాక్షన్ అడ్వెంచర్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆఫ్రికన్-బ్రిటీష్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవలల ఆధారంగా SSMB29 చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. దీని కోసం ఆయన రచించిన ‘ట్రింఫ్ ఆఫ్ ది సన్’, ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ వంటి రెండు పాపులర్ అడ్వెంచర్ నవలల రైట్స్ కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

మహేశ్ మూవీ కోసం రాజమౌళికి ఇష్టమైన దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రచనలపై రీసెర్చ్ చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మహేష్ బాబు ఎంతో ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అని, ఆయన కోసం సాహసోపేతమైన కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగానే రెండు బెస్ట్ సెల్లింగ్ అడ్వెంచర్ నవలల హక్కులను తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికైతే మేకర్స్ సైడ్ నుండి ఎటువంటి అఫిషియల్ కంఫర్మేషన్ లేదు.

ఒకవేళ ఇది నిజమైతే మాత్రం విల్బర్ స్మిత్ నవలల ద్వారా రాజమౌళికి ఖచ్చితంగా సినిమాకి కావాల్సిన సాలిడ్ మెటీరియల్‌ దొరుకుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు పుస్తకాలు ఆఫ్రికాలోని సూడాన్‌లో సెట్ చేయబడ్డాయి. ఆఫ్రికన్ అటవీ ప్రాంతాలలోని అనేక పాత్రల సాహస యాత్రల గురించి వివరిస్తాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో తెలిపారు. కాబట్టి విజువల్ రిఫరెన్స్ కోసం దర్శకుడు ఈ నవలల రైట్స్ తీసుకొని ఉండొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది.

రాజమౌళి తన సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళకముందే, ప్రెస్ మీట్ పెట్టి కథా నేపథ్యాన్ని వివరిస్తూ ఉంటారు. మహేష్ బాబు చిత్రానికి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయితే, అన్ని విషయాలు ముందే వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనా పుష్కర కాలం క్రితమే చర్చలోకి వచ్చిన ‘మహేష్ – రాజమౌళి’ ప్రాజెక్ట్, ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చబోతున్నందుకు ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటి వరకూ పాన్ ఇండియా మూవీ చెయ్యని మహేష్.. ఈసారి జక్కన్నతో కలిసి డైరెక్ట్ పాన్ ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటారని ధీమాగా ఉన్నారు.

SSMB29 మూవీ మహేష్, రాజమౌళి కెరీర్ లోనే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా మారనుంది. RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడి నుంచి రాబోతున్న ఈ సినిమాపై అందరిలో అంచనాలు నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. దీనికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2024 ఆగస్టులో లేదా సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత ఇటీవల తెలిపారు.