ఎమ్మీ అవార్డ్స్ 2024: తెనాల‌మ్మాయా మ‌జాకానా?

తెనాల‌మ్మాయి, ప‌ద‌హార‌ణాల‌ అచ్చ తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాల పేరు ఇటీవ‌ల మార్మోగుతోంది. శోభిత న‌టించిన చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు న‌టిగా త‌న‌కు గొప్ప పేరు తెచ్చిపెడుతున్నాయి. ఒక తెలుగు న‌టి అంత‌ర్జాతీయ స్టాండార్డ్ పెర్ఫామ‌ర్‌గా రూపుదిద్దుకోవ‌డం అంద‌రి మెప్పు పొంద‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు శోభిత ధూళిపాల న‌టించిన `ది నైట్ మేనేజ‌ర్` ప్ర‌తిష్ఠాత్మ‌క ఎమ్మీ నామినేష‌న్ కి వెళ్ల‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఆర్.ఆర్.ఆర్ `నాటు నాటు..`కు ఆస్కార్ అవార్డ్ ద‌క్క‌డంతోనే తెలుగువారి ప్రతిభ ప్ర‌పంచానికి తెలిసొచ్చింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల్లో ఆర్.ఆర్.ఆర్ మెర‌వ‌డంతో ప్ర‌పంచం మొత్తం తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు, టాలీవుడ్ వైపు చూసింది.

ఇప్పుడు తెలుగ‌మ్మాయి న‌టించిన `ది నైట్ మేనేజ‌ర్` వెబ్ సిరీస్ ప్ర‌తిష్ఠాత్మ‌క అంత‌ర్జాతీయ పుర‌స్కారాల వేదిక అయిన `ఎమ్మీ అవార్డ్స్ 2024`లో ప్ర‌ద‌ర్శ‌న‌కు వెళ్ల‌డం, జూరీ నామినేష‌న్ కి పంప‌డం నిజంగా ఒక అద్భుత అనుభ‌వ పాఠం అని భావించాలి. నిజానికి నైట్ మేనేజ‌ర్ లో ఎక్కువ పార్ట్ శోభిత పైనే ఫోక‌స్సివ్ గా ఉంటుంది. న‌టిగా త‌న‌ను ఒక రేంజులో ఎలివేట్ చేసిన సిరీస్ ఇది. అందుకే ది నైట్ మేనేజ‌ర్ తో మ‌రోసారి అంత‌ర్జాతీయ స్థాయిలో ఒక తెలుగ‌మ్మాయి గురించి చ‌ర్చ సాగ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.

అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి స్టార్లు ఉన్నా కానీ ది నైట్ మేనేజ‌ర్ లో శోభితా ధూళిపాళ షో స్టాప‌ర్ గా నిలిచింది. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2024లో బెస్ట్ డ్రామా సిరీస్ విభాగంలో ఇది నామినేట్ కావ‌డంతో…. ఈ షో 14 కేటగిరీలలో భారతదేశం నుండి వచ్చిన ఏకైక ప్రవేశం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సందీప్ మోడీ -ప్రియాంక ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జాన్ లీ కారే నవల అదే పేరుతో పాపుల‌రైన‌ బ్రిటిష్ షో నుండి స్వీకరించిన‌ది. హాలీవుడ్ షోలో టామ్ హిడిల్‌స్టన్, హ్యూ లారీ , ఒలివియా కోల్‌మన్ నటించారు. త‌మ వెబ్ సిరీస్ ఎమ్మీల్లో నామినేటే కావ‌డం గురించి అనిల్, ఆదిత్య, శోభిత ఆనందంగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఎమ్మీకి నామినేట్ కావడం ఒక గొప్ప‌ అనుభూతి. ఈ షో తో మేము ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం గుర్తింపును అందుకోవడం ఆనందాన్నిస్తోంది అని అనీల్ క‌పూర్ అన్నారు.

ఈ సిరీస్‌లో ఆదిత్య రాయ్ క‌పూర్ షాన్ సేన్‌గుప్తా (ది నైట్ మేనేజర్) పాత్రను పోషించాడు. నా మొదటి వెబ్ సిరీస్‌కి ఎమ్మీ నామినేషన్ ద‌క్క‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. మొదటి రోజు నుండి మేం `ది నైట్ మేనేజర్‌`తో ప్రత్యేకంగా ఏదైనా సృష్టిస్తున్నామని మాకు అవ‌గాహ‌న ఉంది. అయితే ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రేమ, గుర్తింపును పొందడం ఎవరూ ఊహించనిది కాదు. ప్రతి ఒక్కరూ చేసిన కృషికి ఫ‌లితం ఇది అని ఆదిత్యా రాయ్ క‌పూర్ అన్నారు.

ఉప్పొంగిన శోభిత మాట్లాడుతూ.. ఇది చాలా అద్భుతమైన వార్త! దర్శకులు సందీప్ మోదీ – ప్రియాంక ఘోష్ స‌హా అద్భుతమైన సాంకేతిక సిబ్బందికి ద‌క్కిన గౌర‌వంగా నేను దీనిని భావిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా ఎగ్జ‌యిట్ చేస్తోంది.. కదిలిస్తోంది.. అని అన్నారు. శోభిత ఇందులో అనిల్ క‌పూర్ భార్య కావేరిగా కనిపించింది. ది నైట్ మేనేజర్‌లో తిలోత్త‌మ‌ షోమ్, శాశ్వత చటర్జీ, రవి బెహ్ల్ కూడా నటించారు. ఇది అద్భుత‌ డ్రామా .. సుందరమైన దృశ్యాలతో తెర‌కెక్కిన‌ హై-ఆక్టేన్ థ్రిల్లర్. డిస్నీ+ హాట్‌స్టార్‌లో రెండు భాగాలుగా విడుదలైంది.

ఎమ్మీ అవార్డ్స్ 2024 కోసం నామినేషన్లను గురువారం న్యూయార్క్‌లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ & సైన్సెస్ ప్రకటించింది. గూఢ‌చారి, మేజ‌ర్ లాంటి చిత్రాల్లో అద్భుతంగా న‌టించిన శోభిత ధూళిపాలకు ఇప్ప‌టికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇటీవ‌లే అక్కినేని నాగ‌చైత‌న్య‌తో శోభిత నిశ్చితార్థం పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి కానుంది. పెళ్లి త‌రవాతా శోభిత తన కెరీర్ ని కొన‌సాగిస్తుందా లేదా అన్న‌ది వేచి చూడాలి.

https://www.tupaki.com/entertainment/sobhita-dhulipala-the-night-manager-emmy-awards-1385691